ఆ 'జాబ్' చాలా కష్టం: ధోని
రాంచీ: న్యూజిలాండ్తో ఇక్కడ జరిగిన నాల్గో వన్డే తరహా వికెట్పై బ్యాటింగ్ ఆర్డర్ కిందకు వెళుతున్నకొద్దీ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా స్లో వికెట్పై లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయన్నాడు.
మిడిల్ ఆర్డర్లో భారత ఆటగాళ్లకు అనుభవం తక్కువ అయిన నేపథ్యంలో వారు మరింత ఓపికతో కూడిన ప్రదర్శన చేయాల్సిన అవసరముందా?అనే ప్రశ్నకు ధోని స్పందించాడు. ఈ తరహా వికెట్పై అనుభవం తక్కువగా ఉన్న మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లకు లక్ష్యాన్ని ఛేదించడం ఎప్పుడూ కష్టతరంగానే ఉంటుందన్నాడు. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వారి సహజసిద్ధమైన ఆటకు ఎప్పుడూ నిబంధనలు విధించకూడదన్నాడు. ఒకవేళ వారు తప్పులు ఏమైనా చేస్తే అనుభవపూర్వకంగా వారే నేర్చుకుంటారన్నాడు. ఈ మేరకు ఆ ఆటగాళ్ల ప్రదర్శనకు మరికొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని ధోని పేర్కొన్నాడు.
ఇక్కడ స్కోరు బోర్డుపై లక్ష్యం పెద్దగా లేకపోయినప్పటికీ, సరైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతోనే ఓటమి పాలయ్యామన్నాడు. స్లో వికెట్ పై స్ట్రైక్ రొటేట్ చేయడం కష్టంగా మారిపోయిందన్నాడు. అయితే మ్యాచ్ ఫినిషర్ జాబ్ అనేది అంత సులభమైనది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా ధోని చెప్పాడు. క్రికెట్ గేమ్లో మ్యాచ్ ఫినిషిర్గా బాధ్యతలు తీసుకోవడం కఠినమైన పనుల్లో ఒకటిగా ధోని పేర్కొన్నాడు. లోయర్ ఆర్డర్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడే ఆటగాడ్ని అన్వేషించడం కూడా కష్టమేనన్నాడు.