న్యూజిలాండ్ ప్టార్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 367 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. తన జట్టు తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన గప్తిల్ కెరీర్‌లో ఓవరాల్‌గా 23 సెంచరీలు చేశాడు.
2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గప్తిల్ 47 టెస్ట్‌లు, 198 వన్డేలు, 122 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 29.4 సగటున 2586 పరుగులు చేసిన గప్తిల్.. ఈ ఫార్మాట్‌లో మూడు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. గప్తిల్ తన మూడు టెస్ట్ సెంచరీలను బంగ్లాదేశ్ (189), జింబాబ్వే (109), శ్రీలంకపై (156) చేశాడు. గప్తిల్ తన చివరి టెస్ట్‌ను 2016లో ఆడాడు.
వన్డేల విషయానికొస్తే.. గప్తిల్ ఈ ఫార్మాట్‌లో 41.7 సగటున, 87.3 స్ట్రయిక్‌రేట్‌తో 7346 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో గప్తిల్ ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. 2015లో గప్తిల్ వెస్టిండీస్‌పై 237 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి, ఏకైక క్రికెటర్ గప్తిల్ మాత్రమే. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (264) పేరిట ఉంది. వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గప్తిల్‌కు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే గప్తిల్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. 2009లోనే వన్డే అరంగేట్రం చేసిన గప్తిల్.. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి ఆటగాడు గప్తిలే.
టీ20ల విషయానికొస్తే.. 135 స్ట్రయిక్‌రేట్‌తో 31.8 సగటున 3531 పరుగులు చేసిన గప్తిల్ పొట్టి ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కెరీర్‌ను ముగించాడు. టీ20ల్లో గప్తిల్ 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన గప్తిల్ న్యూజిలాండ్ తరఫున అండర్-19 స్థాయి నుంచి ఆడుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన సందర్భంగా గప్తిల్ తన సహచరులకు , కోచింగ్ స్టాఫ్‌కు, కుటంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. తన క్రికెటింగ్ కెరీర్ కోసం కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గప్తిల్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment