క్షమించమని వీడియో పెట్టిన స్టార్ క్రికెటర్
దుబాయ్: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫ్యలంపై కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా అదే బాటలో నడిచాడు. తనను మన్నించాలని పాకిస్థాన్ ప్రజలను వేడుకున్నాడు. అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని వాపోయామంటూ తన ట్విటర్ పేజీలో వీడియో సందేశం పోస్టు చేశాడు.
'నా గురించి ఇతరులు ఏమనుకున్నా నేను లెక్క చేయను. కానీ మీకు(పాకిస్థాన్ ప్రజలకు) జవాబుదారీగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజు నన్ను క్షమించమని కోరుతున్నా. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ టీమ్, నేను అంచనాలకు తగినట్టు ఆడలేకపోయాం' అంటూ బ్రీఫ్ వీడియో ద్వారా వేడుకున్నాడు.
తానెప్పుడూ దేశం కోసమే ఆడానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడలేదని అన్నాడు. 20 ఏళ్ల నుంచి స్టార్ హోదా మోస్తున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న అతడు స్వదేశానికి రాగానే కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భావిస్తోంది. 36 ఏళ్ల ఆఫ్రిది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ లో పలు వివాదాలు ఎదుర్కొన్నాడు.