
కోల్‌కతా: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్‌ల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటికే అతనిపై అనేక ఆరోపణలు చేసిన హసీన్ తాజాగా మరో బాంబు పేల్చింది. షమీ తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్)లను మోసం చేశాడంటూ మళ్లీ వార్తల్లో నిలిచింది. తన అసలు వయసు కంటే ఎనిమిదేళ్లు తక్కువగా చూపించే ధ్రువపత్రాలతో అందర్నీ మోసం చేశాడని సోషల్ మీడియా ఫేస్‌బుక్ ద్వారా బయట పెట్టింది.
దీనికి సంబంధించి షమీ ఫొటో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌ను పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను తొలగించింది. ప్రస్తుత రికార్డుల ప్రకారం షమీ పుట్టిన సంవత్సరం 1990 కాగా... జహాన్ షేర్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లో 1982గా ఉంది. ‘షమీ నకీలీ జనన ధ్రువీకరణ పత్రాలతో తన పుట్టిన సంవత్సరం 1990గా చూపిస్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. అతను బీసీసీఐ, క్యాబ్‌లతో పాటు ప్రజలను కూడా వంచించాడు. ఈ తప్పుడు పత్రాలతోనే అం డర్–22 టోర్నీల్లో పాల్గొన్నాడు. దీనివల్ల అర్హులైన 22 ఏళ్ల వయసు గల క్రికెటర్లు నష్టపోయారు’ అని ఆమె పేర్కొంది.