ఒలింపిక్స్ టాస్క్‌ఫోర్స్‌లో బింద్రా, గోపీచంద్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ పతక విజేతల కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌లో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపిక్ చాంపియన్ అభినవ్ బింద్రాలకు చోటుదక్కింది. తదుపరి మూడు ఒలింపిక్స్ (2020, 2024, 2028)ల కోసం కేంద్ర క్రీడాశాఖ చేపట్టిన యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. రియోలో కేవలం రెండే పతకాలతో సరిపెట్టుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆయన సూచనలకు అనుగుణంగా ఏర్పాటైన ‘టాస్క్‌ఫోర్స్’లో భారత హాకీ మాజీ సారథి వీరెన్ రస్కిన్హా, హాకీ కోచ్ బల్‌దేవ్ సింగ్, ప్రొఫెసర్ జి.ఎల్.ఖన్నా, జర్నలిస్ట్ రాజేశ్ కల్రా, గుజరాత్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు హెడ్ ఓం పాథక్ ఉన్నారు.
దీనిపై క్రీడల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ ‘ఈ కమిటీ మూడు నెలలు, లేదంటే తుది నివేదిక సమర్పించేవరకు పనిచేస్తుంది. ఒలింపిక్స్‌లో సత్తాచాటేందుకు ఆటగాళ్లకు అవసరమైన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక శిక్షణలపై ఈ కమిటీ ప్రధానంగా సూచనలివ్వాల్సి వుంటుంది’ అని ఆయన చెప్పారు.