‘పసిడి’తో ముగించారు
చివరి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు స్వర్ణాలు
జాతీయ క్రీడలు
తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో చివరిరోజు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు తమ పతకాల వేటను పసిడితో ముగించారు. శుక్రవారం ఒక్కరోజే తెలంగాణ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు సాధించగా... ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు పతకం నెగ్గింది. బ్యాడ్మింటన్‌లో తెలంగాణ క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-కిడాంబి నందగోపాల్ (తెలంగాణ) జంట 21-14, 19-21, 21-19తో సనావే థామస్-రూపేశ్ కుమార్ (కేరళ) జోడీని ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది.
మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి-రితూపర్ణ దాస్ (తెలంగాణ) ద్వయం 16-21, 21-19, 21-11తో మేఘన-మనీషా (తెలంగాణ) జంటపై నెగ్గి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో రితూపర్ణ దాస్ (తెలంగాణ) 18-21, 18-21తో పి.సి.తులసీ (కేరళ) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో నేలకుర్తి సిక్కి రెడ్డి-కోనా తరుణ్ (తెలంగాణ) జోడీ 18-21, 21-14, 15-21తో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (కేరళ) జంట చేతిలో ఓటమిపాలై రజతాన్ని దక్కించుకుంది. పురుషుల 200 మీటర్ల కనోయ్ డబుల్ ఈవెంట్‌లో నవోబీ సింగ్-నానౌ సింగ్ (తెలంగాణ) జంట లక్ష్యాన్ని 41 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పతకాల పట్టికలో ఓవరాల్‌గా తెలంగాణ 33 పతకాలతో (8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలు) 12వ స్థానంలో నిలిచింది.
శ్యామ్ ‘గోల్డెన్ పంచ్’
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం దక్కింది. 49 కేజీల విభాగంలో వైజాగ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో శ్యామ్ కుమార్ 21-18 పాయింట్ల తేడాతో అమిత్ సింగ్ (హరియాణా)ను ఓడించాడు. ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ 16 పతకాలతో (6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలు) 18వ స్థానంలో నిలిచింది.
సర్వీసెస్ ‘హ్యాట్రిక్’
వరుసగా మూడో జాతీయ క్రీడల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఓవరాల్‌గా సర్వీసెస్ 159 పతకాలు (91 స్వర్ణాలు, 33 రజతాలు, 35 కాంస్యాలు) నెగ్గి టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఆతిథ్య కేరళ రాష్ట్రం 162 పతకాలతో (54 స్వర్ణాలు, 48 రజతాలు, 60 కాంస్యాలు) రెండో స్థానంలో నిలువగా... హరియాణా 107 పతకాలతో (40 స్వర్ణాలు, 40 రజతాలు, 60 కాంస్యాలు) మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. స్వర్ణ పతకాల ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ ఖాయమైంది. శుక్రవారంతో అన్ని క్రీడాం శాల్లో పోటీలు ముగియగా... శని వారం జరిగే ముగింపు వేడుకలతో జాతీయ క్రీడలకు తెరపడుతుంది.