
ఓపెన్ గంగ్నమ్ స్టైల్
ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా సింగర్ సై
ఇంచియాన్: రెండేళ్ల కిందట విచిత్రమైన శైలితో ప్రపంచాన్ని ఊపేసిన ‘గంగ్నమ్ స్టైల్’ ఇప్పుడు ఆసియా క్రీడల వేదిక ఇంచియాన్‌లో హోరెత్తుతోంది. పోటీలకు హాజరవుతున్న వివిధ దేశాల అథ్లెట్లకు దక్షిణ కొరియా ఈ శైలిలో ఘనంగా స్వాగతం పలుకుతోంది. మరో వైపు క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 62 వేల సామర్థ్యం కలిగిన ఇంచియాన్ ఏషియాడ్ స్టేడియం కిక్కిరిసిపోనుంది. కొరియన్ల గుర్తులు, సంస్కృతి సంప్రదాయాలతోపాటు భవిష్యత్‌ను డిజిటల్ టెక్నాలజీలో చూపించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు గేమ్స్ జాయింట్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్న కొరియా సినిమా దర్శకులు ఇమ్ వోన్ టియాక్, జాంగ్ జిన్‌లు తెలిపారు. ‘ఆసియా ఒక్కటే’ పేరుతో రూపొందించిన థీమ్ సాంగ్‌లో 10 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 45 దేశాలు, 4.5 బిలియన్ ప్రజల ఆకాంక్ష ‘ఒకే ఆసియా’ అంటూ ఓ మెసేజ్‌ను ప్రపంచానికి పంపనున్నారు. గంగ్నమ్ స్టైల్ డాన్స్ సృష్టికర్త పార్క్ జే సంగ్ (సై), పియానిస్ట్ లాంగ్ లాంగ్, డాన్సర్లు కిమ్ సియోంగ్ జు, యున్ సు మెంగ్, కొరియా మేటి మ్యూజిషన్ అహ్న్ సుక్ సియోన్, సోప్రానో జో సు మీ, సిలిస్ట్ సాంగ్ ఈయెంగ్ హన్, వయోలిస్ట్ రిచర్డ్ యంగ్‌జీ ఓ నీల్‌లు తమ ప్రదర్శనలను ఇవ్వనున్నారు. ఆసియా భూత, భవిష్యత్, వర్తమానాలకు సంబంధించిన ప్రదర్శనను కూడా ఇందులో ప్రదర్శించనున్నారు.
సింగర్ సై, గంగ్నమ్ స్టైల్, దక్షిణ కొరియా, Singer Psy, gangnam style, South Korea