
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు టెస్టుల సిరీస్ నుంచి టిమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తప్పించడంతో ఇప్పుడు రోహిత్ శర్మ ఓపెనింగ్ రేసులోకి వచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్ ఓపెనర్‌గా కొనసాగుతున్న రోహిత్.. టెస్టుల్లో ఓపెనర్‌గా మాత్రం పెద్దగా రాణించలేదనే చెప్పాలి. ఇక మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ పలు టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రోహిత్‌కు మిడిల్ ఆర్డర్‌లో చాన్సే లేదని అంటున్నాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. కేవలం రోహిత్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ఓపెనర్‌గా రాణించడమేనని పేర్కొన్నాడు.
‘భారత క్రికెట్ జట్టులో రోహిత్ కీలక ఆటగాడు. సఫారీలతో టెస్టు సిరీస్ ద్వారా రోహిత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడనే ఆశిస్తున్నా. తన సహజ సిద్ధమైన ఆటతో రోహిత్ ఆడాలి. అతని సక్సెస్ సూత్రం అదే. దీన్ని టెస్టు ఫార్మాట్‌లో కూడా కొనసాగించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత టెస్టు జట్టులో మిడిల్ ఆర్డర్‌లో పోటీ ఉంది. దాంతో రోహిత్‌కు ఓపెనింగ్ చాలెంజ్ ఎదురుకానుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో రోహిత్‌కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఓపెనర్‌గా మాత్రమే చాన్స్ ఉందనేది నా అభిప్రాయం’ అని బంగర్ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ ఇప్పటివరకూ 27 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1585 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు రోహిత్ సాధించగా, సగటు మాత్రం 39.62గా ఉంది. టెస్టుల్లో రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 177. గత వెస్టిండీస్ పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేసినా టెస్టుల్లో ఆడే అవకాశం దక్కలేదు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించగా, హనుమ విహారి ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రాణించాడు. దాంతో రోహిత్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పడు రాహుల్‌కు జట్టులో చోటు దక్కకపోవడంతో రోహిత్‌ను ఓపెనర్‌గా దింపే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment