పాప ఐసీయూలో ఉన్నా...
కోల్‌కతా: కన్నబిడ్డ ఆసుపత్రిలో ఉంటే ఏ పని చేస్తున్నా మనసంతా పాప మీదే ఉండటం సహజం. ఇలాంటి స్థితిలోనూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా రెండో రోజు ఉదయం 14 నెలల వయసున్న షమీ కూతురు ఆయేరా అనారోగ్యం బారిన పడింది. ఆసుపత్రికి తీసుకెళ్తే ఐసీయూలో చేర్చారు. మ్యాచ్ ముగిశాక ఈ విషయం షమీకి తెలిసింది.
వెంటనే ఆసుపత్రికి వెళ్లి కూతురుని చూసుకుని వచ్చాడు. మూడో రోజు ఆట ముగిశాక కూడా ఆసుపత్రికి వెళ్లాడు. నాలుగో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆయేరాను డిశ్చార్జ్ చేశారు. ఈ మ్యాచ్‌లో షమీ తొలి ఇన్నింగ్‌సలో బ్యాటింగ్‌లో, రెండో ఇన్నింగ్‌సలో రివర్స్ స్వింగ్‌తో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ‘కెప్టెన్‌తో పాటు జట్టు సహచరులంతా ఆయేరా త్వరగా కోలుకుంటుందంటూ ధైర్యం చెప్పారు. ప్రతిరోజూ ఆసుపత్రి నుంచి రాగానే పాప గురించి అడిగేవారు. వారందరికీ నా ధన్యవాదాలు’ అని షమీ భారత క్రికెటర్లకు కృతజ్ఞతలు తెలిపాడు.