
వారెవ్వా... పేస్
⇒ 41 ఏళ్ల వయస్సులో 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్
⇒హింగిస్‌తో కలిసి ‘మిక్స్‌డ్’ విభాగంలో విజేత
⇒ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడోసారి ఈ ఘనత
మెల్‌బోర్న్: ఉత్సాహానికి అనుభవం తోడైతే అద్భుత ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి నిరూపించాడు.34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి 41 ఏళ్ల లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ జంట డానియల్ నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించింది.
ఓవరాల్‌గా పేస్ కెరీర్‌లో ఇది 15 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఇందులో ఎనిమిది పురుషుల డబుల్స్ విభాగంలో, ఏడు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పేస్‌కిది మూడో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్. గతంలో మార్టినా నవ్రతిలోవా (2003లో); కారా బ్లాక్ (2010లో) లతో కలసి అతను చాంపియన్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన పేస్-హింగిస్ జంటకు 1,42,500 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 68 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
హోరాహోరీగా సాగుతుందనుకున్న ఫైనల్ పేస్, హింగిస్ ధాటికి ఏకపక్షంగా ముగిసింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మూడు పదుల వయసు దాటినప్పటికీ పేస్, హింగిస్‌లిద్దరూ ఆద్యంతం సమన్వయంతో కదలడం, కీలకదశలో పాయింట్లు రాబట్టడంతో నెస్టర్-మ్లడెనోవిచ్ జంట ఏదశలోనూ తేరుకోలేకపోయింది.
‘‘ఆస్ట్రేలియాకు క్రమం తప్పకుండా రావడం, విజేతగా నిలువడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. హింగిస్‌తో కలిసి ఆడటం ఆనందంగా అనిపించింది. ఆమె ఆట నుంచి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను.’’ -పేస్