కోహ్లి-పైన్(ఫైల్‌ఫొటో)
బ్రిస్బేన్: భారత్ తొలిసారి పింక్ బాల్ టెస్టులో ఆడటం ఒకటైతే, అది కూడా స్వదేశంలోనే ముందుగా గులాబీ బాల్ పరీక్షను సిద్ధం కావడం మరొకటి. భారత్ పర్యటనకు బంగ్లాదేశ్ వచ్చిన క్రమంలో ముందస్తు షెడ్యూల్ లేని పింక్ బాల్ మ్యాచ్‌ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చొరవ తీసుకుని మరీ అందుకు బీసీబీని కూడా ఒప్పించాడు. ఈ క్రమంలోనే ముందుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. దీనికి కోహ్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆపై బీసీబి కూడా ఒప్పుకోవడంతో పింక్ బాల్ టెస్టు సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించడం ఒకటైతే, ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టు ఆడాలంటూ ఇప్పటికే పలువురు మాజీలు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగానే, ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌కు సైతం ఇదే ప్రశ్న ఎదురైంది.
పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ విజయం సాధించిన తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ పైన్‌ను భారత్‌తో పింక్ బాల్ టెస్టు గురించి ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు. ‘మీరు భారత్‌తో పింక్ బాల్ టెస్టు ఆడటానికి సిద్ధంగా ఉన్నారా’ అని అడిగాడు. దానికి పైన్ కాస్త కొంటెగానే సమాధానం చెప్పాడు. ‘మేము సిద్ధమే.. మరి అక్కడ కోహ్లి ఒప్పుకోవాలి కదా. ఒకవేళ కోహ్లి మంచి మూడ్‌లో ఉంటే ఒప్పుకుంటాడు. అప్పుడు మా మధ్య పింక్ బాల్ టెస్టు జరుగుతుంది. మేము పింక్ బాల్ టెస్టును భారత్‌తో ఆడటానికి యత్నించాం. మళ్లీ ప్రయత్నిస్తాం కూడా. అవసరమైతే కోహ్లి నిర్ణయం కోసం పరుగెడతాం. ఏదొక రోజు పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌కు మేము ఊహించిన సమాధానాన్ని పొందుతాం. అది కచ్చితంగా జరుగుతుంది.
ఎప్పుడ్నుంచో భారత్‌తో పింక్ బాల్ టెస్టు ఆడాలనుకుంటున్నాం. కానీ కోహ్లి అందుకు సిద్ధంగా లేడు. ఇప్పుడు భారత్ పింక్ బాల్ టెస్టు ఆడింది కాబట్టి, తమతో వచ్చే సమ్మర్‌లో పింక్ బాల్ టెస్టు ఉంటుందనే అనుకుంటున్నా’ అని అన్నాడు. తాను మళ్లీ కోహ్లిని పింక్ బాల్ మ్యాచ్ కోసం అడుగుతానని, అప‍్పుడు అతని నుంచి అనుమతి వస్తే మ్యాచ్ జరుగుతుందన్నాడు. అది కూడా కోహ్లి మంచి మూడ్‌లో ఉన్నప్పుడు అయితేనే తమ మధ్య పింక్ బాల్ టెస్టు సాధ్యమవుతుందని చమత్కరించాడు. గత ఏడాది అడిలైడ్‌లో భారత్‌తో పింక్ బాల్ మ్యాచ్ కోసం ఆసీస్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పింక్ బాల్‌తో మ్యాచ్‌కు కోహ్లి నో చెప్పడంతో అది జరగలేదు. కాగా, ఇప్పుడు టీమిండియా పింక్ బాల్ టెస్టులకు ఆసక్తి చూపుతూ ఉండటంతో ఆసీస్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment