ఆఫ్రిది మెరుపులు; పాక్ భారీ స్కోరు
కోల్ కతా: హఫీజ్, షహజాద్ అర్థసెంచరీలకు ఆఫ్రిది మెరుపులు జతకావడంతో బంగ్లాదేశ్ ముందు పాకిస్థాన్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. బంగ్లాకు 202 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై పాక్ బ్యాట్స్ మన్ ఎదురుదాడి చేశారు. చివరివరకు దూకుడు కొనసాగించి స్కోరు 200 పరుగులు దాటించారు. షెహజాద్(52, 39 బంతుల్లో 8 ఫోర్లు), హఫీజ్(64, 42 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సౌమ్య సర్కార్ సూపర్ క్యాచ్ తో హఫీజ్ ను పెవిలియన్ కు పంపాడు.
కెప్టెన్ ఆఫ్రిది మరోసారి తనదైన శైలిలో చితకబాదాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు పిండుకున్నాడు. షర్జీల్ ఖాన్ 18, షోయబ్ మాలిక్ 15 పరుగులు చేశారు. ఉమర్ అక్మల్ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, అరాఫత్ సన్నీ రెండేసి వికెట్లు పడగొట్టారు. సమీర్ రహమాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.