భారత్‌తోనే తేల్చుకుంటాం | pakistan win a match | Sakshi
Sakshi News home page

భారత్‌తోనే తేల్చుకుంటాం

Published Thu, Jun 8 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

భారత్‌తోనే తేల్చుకుంటాం

భారత్‌తోనే తేల్చుకుంటాం

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌లో వాన మరో మ్యాచ్‌ను అసంపూర్ణంగానే ముగించింది. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌) పద్ధతే తేల్చింది. డీఎల్‌ ప్రకారం పాక్‌ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షంతో ఆటనిలిచే సమయానికి పాకిస్తాన్‌ 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ (31), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ (31 నాటౌట్‌) కాస్త మెరుగ్గా ఆడటం ‘డక్‌వర్త్‌’ లెక్కలకు పనికొచ్చింది. ఈ పద్ధతిలో 27 ఓవర్లకు 101 పరుగులు చేస్తే చాలు... అయితే పాక్‌ ఇంకా 19 పరుగులు ముందంజలోనే ఉండటం, వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో పాక్‌ విజయం ఖాయమైంది.


పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధారణ ఆటతీరుతో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా.. భారత్‌తో జరిగే చివరిలీగ్‌ మ్యాచ్‌లో తమ ప్రత్యేకత చూపిస్తామని ఆజట్టు పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం భారత్‌తో జరిగే పోరు తమకు చాలా కీలకమని, ఆ జట్టుపై గెలుపొందేందుకు టీమంతా సమిష్టి ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో నిరాశజనక ఆటతీరు ప్రదర్శించిన తాము, భారత్‌తో మ్యాచ్‌లో తప్పకుండా అసాధరణ ఆటతీరు ప్రదర్శిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

గత ఎనిమిది నెలలుగా జట్టులో తన స్థానంపై అనిశ్చితి నెలకొందని, అయితే బరిలోకి దిగిన ప్రతిసారి ఉత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించానని పేర్కొన్నాడు. మరోవైపు ప్రొటీస్‌ కోచ్‌ రసెల్‌ డొమింగో తన జట్టును వెనకేసుకొచ్చాడు. పాక్‌తో మ్యాచ్‌లో కెరీర్‌లో తొలిసారి మొదటి బంతికే డకౌటైన కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ను సమర్థించాడు. కెరీర్‌లో చాలా మంది తొలి బంతికే వెనుదిరిగే సందర్భం వస్తుందని, అయితే ఏబీకి ఇది జరగడానికి 200 వన్డేలకుపైగా సమయం పట్టిందని పేర్కొన్నాడు. భారతో జరిగే మ్యాచ్‌లో ఏబీ నుంచి భారీ ప్రదర్శన ఆశిస్తున్నామని, జట్టుకు అవసరమైన వేళ ఏబీ తప్పకుండా రాణిస్తాడని రసెల్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. 

అయ్యో పాపం సఫారీ: దక్షిణాఫ్రికా దురదృష్టమో... ఈ వాన వైపరీత్యమో కానీ... సఫారీ జయాపజయాల్ని ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ కాలరాస్తోంది. గత 11 మ్యాచ్‌ల డీఎల్‌ ఫలితాల్లో 8 సార్లు జట్టు పరాజయాన్నే చవిచూసింది. 2015 నుంచి ఇప్పటి వరకు  ‘డక్‌వర్త్‌’ తేల్చిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా గెలవలేకపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement