తండ్రికి హార్దిక్ పాండ్యా సర్ ప్రైజ్!
న్యూఢిల్లీ:ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లి సేన.. ఐదు వన్డేల సిరీస్ కు సిద్ధమవుతోంది. ఆదివారం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది.
అయితే భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అక్కడి నుంచే తన తండ్రి హిమాన్షు పాండ్యాకి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను అందజేశాడు. తన సోదరుడు కృనాల్ తో కలిసి కారును బహుమతిగా ఇచ్చాడు. గతంలోనే హార్దిక్, కృనాల్ లు తండ్రి హిమాన్షుకి కారు కొనివ్వాలని అనుకున్నారు. దీన్ని వరుసకి సోదరుడైన వైభవ్ కు వివరించారు. ఈ క్రమంలోనే హార్దిక్ తండ్రి హిమాన్షుని వైభవ్ కార్ల షోరూమ్ కి తీసుకెళ్లాడు. అదే సమయంలో హార్దిక్ స్మార్ట్ ఫోన్ వీడియో కాల్ ద్వారా లైన్ లోకి వచ్చాడు.
అప్పుడు తండ్రిని ఓ కారు ఎంపిక చేయమని అడగ్గా.. ఆయన వెంటనే ఎరుపు రంగు కారు బాగుందని తెలిపాడు. దీంతో వెంటనే షోరూమ్ సిబ్బంది ఆ కారు యాజమాని మీరే అని చెప్పడంతో హార్దిక్ తండ్రికి ఏమి జరుగుతందో అర్ధం కాలేదు. కాకపోతే కాసేపటికి విషయం తెలుసుకున్న హిమాన్షు తన కుమారులు ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ను చూసి మురిసిపోయారు. వీడియో కాల్ లోనే ఉన్న హార్దిక్తో ఐ లవ్ యూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సన్నివేశాన్నిమొత్తం హార్దిక్ పాండ్యా తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'తండ్రి ముఖంలో ఆనందం చూడటం ఎంతో సంతోషంగా ఉంది. మా కోసం ఆయన ఎన్నో వదులుకున్నారు. ఆయన సపోర్ట్ తోనే ఇదంతా మేము సాధించాం. అందుకే ఆయనకు చిన్న సర్ ప్రైజ్'అని హార్దిక్ పేర్కొన్నాడు.