సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్ ఈ ఘనత సాధించాడు. గోపాల్ సాధించిన హ్యాట్రిక్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వికెట్లు ఉన్నాయి.
పాండ్యా సోదరులను గోపాల్ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్.. హార్దిక్, కృనాల్ వికెట్లతో పాటు శాశ్వత్ రావత్ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓటమిపాలైంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్ రవిచంద్రన్ (38), కృష్ణణ్ శ్రీజిత్ (22), శ్రేయస్ గోపాల్ (18), మనీశ్ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, అతీత్ సేథ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్ మేరీవాలా, ఆకాశ్ మహారాజ్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్ గోపాల్ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్), అతీత్ సేథ్ (6 నాటౌట్) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్‌లో శాశ్వత్ రావత్ (63), భాను పూనియా (42) రాణించారు.
కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ గోపాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్‌కు ఐపీఎల్‌లోనూ హ్యాట్రిక్ తీసిన ఘనత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment