సాక్షి, బెంగళూర్ : చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయిన ఆసీస్ విధించిన భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి ప్రేక్షకులకు మజా పంచారు. కానీ, యువ సంచలనం హర్ధిక్ పాండ్యా బాదిన ఓ సిక్స్ మాత్రం ఓ ప్రేక్షకుడికి చేదు అనుభవం మిగిల్చింది.
స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జాబ్ చేసే 24 ఏళ్ల తోసిట్ అగర్వాల్ స్టేడియం పెవిలియన్ 1 లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్నాడు. ఇంతలో పాండ్యా కొట్టిన బంతి అతని వైపు దూసుకొచ్చింది. తోసిట్ చేతులు అడ్డుపెట్టుకుని ఆపేందుకు యత్నించినా వీలు కాలేదు. అది సరాసరిగా వచ్చి అతని మూతికి తగిలింది.
దవడ పగిలి తీవ్ర రక్త స్రావం కావటంతో స్టేడియం నిర్వాహకులు అతన్ని హోస్మట్ ఆస్పత్రికి తరలించారు. అతని కింది దవడకు గాయం కావటంతో మధ్య పన్ను కాస్త వదులయ్యిందని, పెదవికి కుట్లు వేసినట్లు డాక్టర్ అజిత్ బెనడిక్ట్ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ - ఇండియాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో సురేశ్ రైనా కొట్టిన షాట్‌కు సతీష్ ఆరేళ్ల కుర్రాడి కాలికి గాయం అయిన విషయం తెలిసిందే.