పంత్‌ చివరి నిమిషంలో మిస్‌: ఎమ్మెస్కే  | Pant miss the last minute - msk | Sakshi
Sakshi News home page

పంత్‌ చివరి నిమిషంలో మిస్‌: ఎమ్మెస్కే 

Published Tue, Apr 16 2019 12:51 AM | Last Updated on Tue, Apr 16 2019 12:51 AM

Pant miss the last minute - msk - Sakshi

ముంబై: రిషభ్‌ పంత్‌కు దాదాపు చోటు ఖరారయ్యే పరిస్థితి ఉన్నా... చివరకు అవకాశం దక్కలేదని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పష్టం చేశారు. సుదీర్ఘ చర్చలో సెలక్టర్లు అనుభవజ్ఞుడైన దినేశ్‌ కార్తీక్‌వైపు మొగ్గుచూపడంతో పంత్‌కు ఇంగ్లండ్‌ దారులు మూసుకుపోయాయని చెప్పారు. ‘రెండో వికెట్‌ కీపర్‌గా ఎవరిని తీసుకోవాలనే చర్చ సుదీర్ఘంగా జరిగింది. అయితే ధోని గాయపడినపుడే వికెట్‌ కీపర్‌ తుది జట్టుకు ఆడతాడు. అలాంటి పరిస్థితి కీలకమైన సెమీస్‌లాంటి మ్యాచ్‌ల్లో వస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయో చర్చించే చివరకు కార్తీక్‌ను సెలక్ట్‌ చేశాం. పంత్‌ ప్రతిభావంతుడే కానీ దురదృష్టవశాత్తు ఆఖర్లో అవకాశాన్ని కోల్పోయాడు’ అని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే వివరించాడు.  

తొలిసారిగా డేటా ప్రజంటేషన్‌ 
మామూలు ట్రై సిరీస్, పర్యటనలకే ఆటగాళ్ల గణాంకాలను పలుమార్లు పరిశీలిస్తారు. మరి ప్రపంచకప్‌ సెలక్షన్‌ అంటే ఆషామాషీ కాదు. కాబట్టే తొలిసారి గణాంకాల విశ్లేషణను ప్రజంటేషన్‌ రూపంలో చూశారు. అంటే ఎంపిక ప్రక్రియలో సాధారణంగా ఆటగాళ్ల వివరాలు కేవలం మ్యాచ్‌లు, ఇన్నింగ్స్, చేసిన పరుగులు, స్ట్రయిక్‌ రేట్, తీసిన వికెట్లు, ఎకానమి రేట్‌ ఇలా అంకెలతో ఉండేవి. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఈ సెలక్షన్‌లో తొలిసారిగా భిన్నమైన పద్ధతిని అవలంభించారు. మూడున్నర గంటల పాటు సాగిన ఆటగాళ్ల విశ్లేషణాత్మక ప్రజంటేషన్‌లో ఎవరు ఎక్కడ బాగా ఆడతారు. ఎవరి షాట్లు ఎక్కడ పరుగులు తెచ్చిపెడతాయి. ఏ ఓవర్లలో ఎవరు మెరుగు, ఎలాంటి పరిస్థితుల్లో ఏ బౌలర్‌ అదరగొట్టాడు తదితర అంశాల్ని కూలంకశంగా ప్రజంటేషన్‌ రూపంలో చూశారు. ఆ తర్వాతే జట్టు ఎంపికపై సెలక్టర్లు అంచనాకు వచ్చారు. దీన్ని డేటా విశ్లేషకుడు ధనంజయ్‌ సిద్ధం చేశాడు. మెగా ఈవెంట్, ప్రధాన టోర్నీకి ముందు ఇలాంటి ఎంపిక ప్రక్రియతోనే శ్రీకారం చుడతామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement