గుజరాత్ గెలిచిందోచ్...
తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ సొంతం
* ఫైనల్లో ఢిల్లీపై 139 పరుగులతో ఘనవిజయం
* కెప్టెన్ పార్థివ్ పటేల్ సెంచరీ
* చెలరేగిన ఆర్పీ సింగ్, బుమ్రా
బెంగళూరు: సమష్టిగా రాణిస్తే... ప్రత్యర్థి జట్టులో మేటి ఆటగాళ్లు ఉన్నా విజయం సాధించొచ్చని గుజరాత్ జట్టు నిరూపించింది. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని తొలిసారి కైవసం చేసుకుంది.
భారత జట్టు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు సోమవారం జరిగిన ఫైనల్లో 139 పరుగుల ఆధిక్యంతో ఢిల్లీ జట్టును చిత్తుగా ఓడించింది. గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, ఉన్ముక్త్ చంద్, ఇషాంత్ శర్మలాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఢిల్లీ జట్టుకు నిరాశ తప్పలేదు. 2010-11 సీజన్‌లో గుజరాత్ రన్నరప్‌గా నిలిచినా... ఈసారి మాత్రం విజేతగా నిలిచి తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా...
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ పార్థివ్ పటేల్ (119 బంతుల్లో 105; 10 ఫోర్లు) సెంచరీ సాధించగా... రుజుల్ భట్ (74 బంతుల్లో 60; 4 ఫోర్లు, ఒక సిక్స్), చిరాగ్ గాంధీ (39 బంతుల్లో 44; 4 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ జట్టులో నవ్‌దీప్ సైని, సుభోద్ భాటి, పవన్ నేగి రెండేసి వికెట్లు తీశారు. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 32.3 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.
భారత జట్టు మాజీ సభ్యుడు రుద్రప్రతాప్ (ఆర్పీ) సింగ్ (4/42), జస్‌ప్రీత్ బుమ్రా (5/28) తమ పేస్ బౌలింగ్‌తో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. శిఖర్ ధావన్ (5), గౌతమ్ గంభీర్ (9) విఫలమవ్వగా... ఉన్ముక్త్ చంద్ (33; 6 ఫోర్లు), పవన్ నేగి (57; 9 ఫోర్లు, ఒక సిక్స్) కాస్త పోరాటిపటిమ కనబరిచినా ఫలితం లేకపోయింది.