గుజరాత్ గుబాళింపు
తొలిసారి రంజీ ట్రోఫీ సొంతం
ఫైనల్లో ముంబైపై విజయం
ఇండోర్: కెప్టెన్ పార్థివ్ పటేల్ (143; 24 ఫోర్లు) వీరోచిత సెంచరీ సాధించి గుజరాత్ క్రికెట్ జట్టు కల నెరవేర్చాడు. ముంబై జట్టుతో జరిగిన ఫైనల్లో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించింది. ముంబై నిర్దేశించిన 312 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ 89.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. 89 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను పార్థివ్ పటేల్, మన్‌ప్రీత్ జునేజా (54; 8 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. జునేజా అవుటయ్యాక రుజుల్ భట్ (27 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి పార్థివ్ ఐదో వికెట్‌కు 94 పరుగులు జతచేశాడు.
విజయానికి 13 పరుగుల దూరంలో ఉన్నపుడు పార్థివ్ అవుటైనా రుజుల్, చిరాగ్ గాంధీ (11 నాటౌట్) మరో వికెట్ పడకుండా గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో గుజరాత్ జట్టు భారత దేశవాళీలో జరిగే మూడు ఫార్మాట్‌ల టోర్నీలు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే, సయ్యద్ ముస్తాక్ అలీ టి20) నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. తొలిసారి రంజీ ట్రోఫీ నెగ్గిన తమ జట్టుకు గుజరాత్ క్రికెట్ సంఘం రూ. 3 కోట్లు నజరానాగా ప్రకటించింది.