విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా నిన్న (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌ల్లో రెండు ప్రధాన రికార్డులు నమోదయ్యాయి. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు టోర్నీ మూడో అత్యధిక స్కోర్ (427) నమోదు చేయగా.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్ అర్పిత్ గులేరియా 8 వికెట్ల ప్రదర్శనతో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు.
అర్పిత్ నమోదు చేసిన ఈ గణాంకాలు (9-0-50-8) లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే 11వ అత్యుత్తమ గణాంకాలుగా రికార్డు కాగా.. భారత్ తరఫున 8 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అర్పిత్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల అర్పిత్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అర్పిత్‌కు ముందు షాబాజ్ నదీం (8-10), రాహుల్ సింఘ్వి (8-15) లిస్ట్-ఏ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లుగా ఉన్నారు. ఓవరాల్‌గా కూడా లిస్ట్-ఏ క్రికెట్‌లో వీరిద్దరివే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. అర్పిత్ గులేరియా 8 వికెట్లతో విజృంభించినా హిమాచల్ ప్రదేశ్ ఓటమిపాలైంది. గుజరాత్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో హిమాచల్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గులేరియా ధాటికి 49 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో అద్బుతంగా పోరాడిన హిమాచల్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (49.5 ఓవర్లలో 319 ఆలౌట్) నిలిచిపోయింది.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఉర్విల్ పటేల్ (116) సీజన్ రెండో సెంచరీతో విజృంభించగా.. మరో ఓపెనర్ ప్రయాంక్ పంచల్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హిమాచల్ ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ చోప్రా (96) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. ఆఖర్లో సుమీత్ వర్మ (47 బంతుల్లో 82; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో హిమాచల్ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు.
Comments
Please login to add a commentAdd a comment