Heavy Rains In Maharashtra, Delhi, Gujarat, Himachal Pradesh: What IMD Says? - Sakshi
Sakshi News home page

ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు. పలు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్!

Published Thu, Jun 29 2023 3:35 PM | Last Updated on Thu, Jun 29 2023 3:57 PM

Heavy rains In Mumbai Delhi Gujarat Himachal Pradesh What IMD Says - Sakshi

నైరుతి రుతుపవనాల రాకతో దేశ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా, ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ సహాలు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.  డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.  వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా పలుచోట్ల మరణాలు సైతం వెలుగుచూశాయి.

ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 23.5 డిగ్రీలు కాగా, గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఢిల్లీకి అరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.
చదవండి: మణిపూర్‌లో రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌ అడ్డగింత

హర్యానా
కాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో గురువారం ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతోంది. దాదాపు 25కు పైగా ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు పంపుల ద్వారా నీటిని తొలగిస్తున్నారు.

మహారాష్ట్రలో వర్షాలతో ఇద్దరు మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బుధవారం కారు అదుపుతప్పి రోడ్డుపై నుంచి దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. వాతావరణ శాఖ ప్రకారం రానున్న రోజుల్లోనూ పలు నగరాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

ముంబై
మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు మరణించారు. బుధవారం ముంబయిలోని మలాద్‌ ప్రాంతంలో వర్షాలతో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని కౌశల్ దోషి (38)గా గుర్తించామని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలోని థానే , పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని, దీంతొ అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు పేర్కొన్నారు.  కొన్ని చోట్ల చెట్లు కూలినట్లు చెప్పారు.

మరోవైపు గత రెండు రోజులుగా కురుస్తున్న వరదల్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లోని బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.  కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా 100కి పైగా రోడ్లు మూసేశారు. బుధవారం భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో కారు అదుపుతప్పి లోయలోపడిపోవడంతో నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు.

గుజరాత్
అటు గుజరాత్ రాష్ట్రాన్నీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవలే బిపర్ జాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన గుజరాత్‌లో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో మరోసారి వర్షం దంచికొట్టింది. నవ్సారి, వల్సాద్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మరియు దాని పరిసర ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి, సాధారణ జనజీవనం ప్రభావితమైంది మరియు ఉదయం కార్యాలయ వేళల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గంగా నది దక్షిణ మరియు ఉప-హిమాలయన్ నార్త్ బెంగాల్‌లో మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఉత్తరాఖండ్
ఇక ఉత్తరాఖండ్ నూ గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జులై 5వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో డెహ్రాడూన్‌తోపాటు రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గోవా
గోవాలోని కొన్ని ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిశాయి, వాతావరణ శాఖ గురువారం వరకు కోస్తా రాష్ట్రానికి 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది. సూచన నిర్దిష్ట ప్రదేశాలలో తీవ్రమైన జల్లులను అంచనా వేస్తుంది.

రాబోయే రోజులలో రుతుపవనాల ప్రభావంపై సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రుతుపవనాలు దాని అధునాతన దశలో ఉన్నాయని, ఇవి చురుకుగా పనిచేస్తున్నాయని అన్నారు.మధ్యప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాన్నారు.  దక్షిణ గుజరాత్, కొంకణ్ గోవాలోని కొన్ని ప్రాంతాలలో గురువారం అత్యంత భారీ వర్షాలు (20 సెం.మీ కంటే ఎక్కువ) కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.  తూర్పు, ఈశాన్య భారతదేశంలో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement