
'నీ గురించి మాట్లాడేందుకు గర్వపడుతున్నా'
మాక్స్‌విలేలో హ్యూస్ అంత్యక్రియల కార్యక్రమంలో అందరికంటే ముందుగా దేశం తరఫున, కుటుంబం తరఫున ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రసంగించాడు. పంటి బిగువన కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేసినా... మధ్యలో తట్టుకోలేక ఏడుస్తూ క్లార్క్ చేసిన ప్రసంగం సంక్షిప్తంగా...
'హ్యూస్... నీ గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నా. నిన్ను చూసి మాక్స్‌విలే గర్విస్తోంది. చిన్న వయసులో ఆటకు, కుటుంబానికి దూరమైనందుకు బాధగా ఉంది. అయితే ఆటపై నీవు వేసిన ముద్ర ఎప్పటికీ చెదిరిపోదు. గత గురువారం రాత్రి సిడ్నీ మైదానంలో నడుచుకుంటూ వెళ్తుంటే అదే పచ్చిక నా పాదాలను తాకింది. గతంలో నీవు, నేను, మన సహచరులు ఎంతో మంది ఇక్కడ భాగస్వామ్యాలను నెలకొల్పాం. మన కలలను సాకారం చేసుకున్నాం.
నీవు పడిపోయిన ప్రదేశంలో మోకాళ్లపై వంగి పచ్చికను తాకా. ప్రమాణం చేసి చెబుతున్నా.. నీవు మాతోనే ఉన్నావనే అనుభూతి కలిగింది. నేను ఆడిన చెత్త షాట్ గురించి మాట్లాడటం, రాత్రి పూట చూసిన సినిమాల గురించి చర్చించడం, అప్పుడప్పుడు నీ ఆవుల గురించి కొన్ని పనికి రాని నిజాలు నాతో పంచుకోవడం.. వీటిని ఎన్నటికీ మర్చిపోలేను. ఈ మైదానం నాకెప్పటికీ ఓ పవిత్ర భూమిగానే ఉంటుంది.
ఇక్కడ నీ ఉనికిని నేను ఆస్వాదిస్తా. క్రికెట్‌ను అభిమానించే ప్రతి ఒక్కరు హ్యూస్‌కు నివాళులు అర్పిస్తూనే ఉంటారు. ఫొటోలు, మాటలు, ప్రార్థనలు, చర్చల ద్వారా ప్రపంచం మొత్తం స్ఫూర్తిని చాటింది. కరాచీలో ఓ బాలిక క్యాండిల్‌తో నివాళి అర్పిస్తే, ఆటకే మాస్టర్లు అయిన సచిన్, వార్న్, లారా ప్రపంచానికి తమ శోకాన్ని చూపించారు. ఈ క్రికెట్ స్ఫూర్తి మా అందర్ని కట్టిపడేసింది. క్రికెట్ బంధం ప్రపంచం మొత్తం తమ బ్యాట్‌లను బయటపెట్టి నివాళులు అర్పించేలా చేసింది. అందుకే ప్రపంచంలో క్రికెట్ గొప్ప ఆటగా మారిపోయింది. నా తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నా. ఆటలో నిన్ను ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాం'