
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఎనిమిది జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆతిథ్య వేదికలకు చేరుకుని ఐసీసీ టోర్నమెంట్‌కు సన్నాహకాలు మొదలుపెట్టాయి.
ఇక ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్(Pakistan) దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు, విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియాను టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొనగా.. పాకిస్తాన్ లెజెండరీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ ఈసారి కూడా భారత్- పాక్ ఫైనల్లో తలపడతాయని జోస్యం చెప్పాడు.
ఇక ఓవరాల్‌గా మెజారిటీ మంది భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-4కు చేరతాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(Michael Clarke) సైతం ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగుల, వికెట్ల వీరులు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, టోర్నీ విజేతపై తన అంచనాలు తెలియజేశాడు.
టాప్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్‌గా వారే
‘‘ఈసారి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవబోతోంది. వాళ్ల కెప్టెన్ ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాదు.. ఈసారి అతడే చాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్‌స్కోరర్ కాబోతున్నాడు. అతడు మునుపటి లయను అందుకోవడం సంతోషంగా ఉంది. టీమిండియాకు అతడి సేవలు అవసరం.
ఇక ఈసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవబోతున్నాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై మాత్రం నేను ఎక్కువగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే, ఆర్చర్ మాత్రం ఓ సూపర్‌స్టార్. అందుకే అతడే ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ అని చెప్పగలను.
‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా హెడ్
ఇక ఈ టోర్నమెంట్లో ట్రవిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవుతాడు. ప్రస్తుతం అతడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో గతేడాది అదరగొట్టాడు. ఇటీవల టెస్టుల్లోనూ దుమ్ములేపాడు. అయితే, శ్రీలంక పర్యటనలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా మళ్లీ త్వరలోనే బ్యాట్ ఝులిపించగలడు.
అయితే, ట్రవిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చినా.. ఈసారి ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్లో ఓడిపోతుందని అనిపిస్తోంది. ఏదేమైనా హెడ్ మాత్రం హిట్టవ్వడం ఖాయం. నిజానికి అతడి బౌలింగ్ కూడా బాగుంటుంది. కానీ.. బౌలింగ్‌లో అతడి సేవలను ఆస్ట్రేలియా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు’’ అని మైకేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో అతన అభిప్రాయాలు పంచుకున్నాడు.
క్లార్క్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. విరాట్ కోహ్లి అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈసారి కింగ్ కోహ్లినే టాప్ రన్‌స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పాల్గొంటున్నాయి.
చదవండి: ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే..!
Comments
Please login to add a commentAdd a comment