ఆస్ట్రేలియా సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు నాథన్ మెక్‌స్వీనీని తప్పించడాన్ని తప్పుబట్టాడు.
కేవలం మూడు మ్యాచ్‌ల ఆధారంగా అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా అని మండిపడ్డాడు. కాగా భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో చివరి రెండు టెస్టులకు ఆసీస్ తమ జట్టులో ఒక మార్పు చేసిన విషయం తెలిసిందే.
టీనేజ్ సంచలనం ఎంట్రీ
మూడు టెస్టుల్లోనూ విఫలమైన టాపార్డర్ బ్యాటర్ మెక్‌స్వీనీనిపై కంగారూ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. 25 ఏళ్ల ఈ యువ ఓపెనర్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 10, 0, 39, 10 నాటౌట్, 9, 4 పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడి స్థానంలో టీనేజ్ సంచలనం సామ్ కొన్‌స్టాస్‌ను జాతీయ టెస్టు జట్టులోకి ఎంపిక చేసింది.
సీనియర్ల మాటేమిటి?
ఈ విషయంపై మైకేల్ క్లార్క్ స్పందించాడు. ‘‘నాథన్ మెక్‌స్వీనీ కాకుండా.. 30 ఏళ్లు, ఆపై వయసున్న వాళ్ల పట్ల మన విధానం ఎలా ఉంది? యువకులకు ఒకటీ అరా అవకాశాలు ఇచ్చి.. వెంటనే జట్టు నుంచి తప్పిస్తారా? అనుభవం ఉన్నా విఫలమవుతున్న, వయసు పైబడుతున్న వాళ్లను మాత్రం కొనసాగిస్తారా?
ఒకవేళ రెండు టెస్టుల వ్యవధిలో ఉస్మాన్ ఖవాజా రిటైర్ అయితే ఏం చేస్తారు? మళ్లీ మెక్‌స్వీనీని వెనక్కి తీసుకువస్తారా? అసలు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారు? ‘అతడిని ఎంపిక చేసి తప్పుచేశాం’ అని అనుకుంటున్నారా?
ఇది నాథన్ మెక్‌స్వీనీ కెరీర్. దానితో మీరు ఆటలాడవద్దు. అతడు మరిన్ని అవకాశాలకు అర్హుడు. ఈ సమ్మర్‌లో మిగిలిన టెస్టులన్నింటిలోనూ అతడిని ఆడించాలి. ఉస్మాన్ ఖవాజాకు 38 ఏళ్లు.
అతడొక సీనియర్ ప్లేయర్. మరి ఓపెనర్‌గా ఈ సిరీస్‌లో పరుగులు రాబట్టలేదు కదా!.. అతడిని కొనసాగించినపుడు మెక్‌స్వీనీని ఎందుకు తప్పించారు?’’ అని క్లార్క్ ఓ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించాడు.
వార్నర్ రిటైర్మెంట్ తర్వాత
కాగా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ స్థానం ఖాళీ అయింది. స్టీవ్ స్మిత్‌ను ఓపెనర్‌గా పంపిన ప్రయోగం విఫలం కావడంతో.. ఈసారి మెక్‌స్వీనీకి అవకాశం వచ్చింది. అయితే, తొలి మూడు టెస్టుల్లో అతడు విఫలం కావడం వల్ల.. 19 ఏళ్ల సామ్ కాన్‌స్టాస్‌కు సువర్ణావకాశం దక్కింది.
ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 26-30 వరకు మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది. ఆఖరి టెస్టుకు సిడ్నీ వేదిక.
చదవండి: ముంబై ప్లేయర్‌గా అతడికి ఇదే లాస్ట్ సీజన్: భారత మాజీ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment