
ఆ క్రికెటర్ దృష్టి సఫారీ వైపు..
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మనసు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనం వైపు మళ్లింది. అందుకు దక్షిణాఫ్రికానే సరైన మార్గమని పీటర్సన్ భావిస్తున్నాడు.
ముంబై: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మనసు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనం వైపు మళ్లింది. అందుకు దక్షిణాఫ్రికానే సరైన మార్గమని పీటర్సన్ భావిస్తున్నాడు. తన క్రికెట్ పునరాగమనానికి దక్షిణాఫ్రికా జట్టు ఒక అవకాశంగా ఉందని గతంలోనే పేర్కొన్న పీటర్సన్.. మరొకసారి దానిపై స్పందించాడు. వచ్చే రెండేళ్ల పాటు దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. 'దాదాపు నలభై ఏళ్ల వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనేది నా కోరిక. అదే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలనే ఆలోచన నాలో పుట్టింది. రాబోవు రెండేళ్ల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. నేను ఎక్కడ ఉంటానో , ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు. ఏమి జరుగుతుందో చూద్దాం. నేనైతే దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు రెండేళ్లపాటు ఆడాలనుకుంటున్నా'అని పీటర్సన్ అన్నాడు.
స్వతహాగా దక్షిణాఫ్రికాలో జన్మించిన పీటర్సన్.. 2004లో ఇంగ్లండ్కు వచ్చి క్రికెట్ కెరీర్ ను ఆరంభించాడు. దాదాపు 10 ఏళ్లు పాటు ఇంగ్లండ్ జట్టులో కొనసాగాడు. అయితే 2013-14 యాషెస్ సిరీస్ అనంతరం పీటర్సన్కు ఈసీబీ ఉద్వాసన పలికింది. దీంతో ఈసీబీ నిర్ణయాన్ని స్వాగతించిన పీటర్సన్ తాను ఇక ఇంగ్లండ్ కు ఆడలేనంటూ ప్రకటించాడు. ఇంగ్లండ్ తరపున 104 టెస్టులో ఆడిన పీటర్సన్ 23 సెంచరీల సాయంతో 8,881 పరుగులు నమోదు చేశాడు. టెస్టులో అతని యావరేజ్ 47.28 ఉండటం విశేషం.