
చెలరేగిన పీటర్సన్
షార్జా: అంతర్జాతీయ క్రికెట్ కు కెవిన్ పీటర్సన్ దూరమై చాలా కాలమే అయినప్పటికీ ఇంకా అద్భుతమైన ఫామ్లోనే కొనసాగుతున్నాడు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో అతను చెలరేగిన తీరే ఇందుకు నిదర్శనం. పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్న పీటరన్స్..శనివారం లాహోర్ క్వాలండర్స్ తో జరిగిన మ్యాచ్లో దుమ్మురేపాడు. 42 బంతుల్లో 8 సికర్లు, 3 ఫోర్లతో 88 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో పీటర్సన్ తనదైన మార్కును ప్రదర్శించాడు.
దాంతో 201 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అతనికి జతగా గ్లాడియేటర్స్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(45;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. సర్ఫరాజ్ అహ్మద్-పీటర్సన్ జోడి ఐదో వికెట్ కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో ఆ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. చివరి 17 బంతుల్లో 63 పరుగులు రావడం ఇక్కడ విశేషం.