పోలాండ్ షూట్... స్విస్ అవుట్
► తొలిసారి క్వార్టర్స్‌కు చేరిన పోలాండ్
► షూటౌట్‌లో స్విట్జర్లాండ్‌కు నిరాశ
► యూరో కప్ టోర్నీ
సెయింట్ ఎటెని (ఫ్రాన్స్): కీలకదశలో ఒత్తిడిని అధిగమించిన పోలాండ్ జట్టు ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోలాండ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4తో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో అరగంటపాటు అదనపు సమయం పొడిగించారు. అయితే అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోవడంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‌లో స్విట్జర్లాండ్ తరఫున రెండో కిక్‌ను జాకా వృథా చేయగా... మిగతా నలుగురు ఆటగాళ్లు స్కోరు చేశారు. మరోవైపు పోలాండ్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లూ సఫలమై చిరస్మరణీయ విజయాన్ని సాధించారు.
యూరో టోర్నీ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశకు చేరుకున్న పోలాండ్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన పోలాండ్ అవకాశం దొరికినపుడల్లా స్విట్జర్లాండ్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఎట్టకేలకు ఆ జట్టు 39వ నిమిషంలో ఖాతా తెరిచింది. ఎడమవైపు నుంచి గ్రోసిస్కీ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న బ్లాస్‌జికౌస్కీ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో పోలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు స్కోరును సమం చేయాలనే ఏకైక లక్ష్యంతో జోరు పెంచారు.
అయితే పోలాండ్ గోల్‌కీపర్ లుకాస్ ఫాబియాన్‌స్కీ వారికి అడ్డుగోడలా నిలిచాడు. ఇక పోలాండ్ విజయం ఖాయమైందని అనుకుంటున్న తరుణంలో... స్విస్ స్టార్ జెర్దాన్ షాకిరి 82వ నిమిషంలో గాల్లో తేలుతూ బైసైకిల్ కిక్‌తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. నిర్ణీత సమయం ముగిసేలోపు రెండుసార్లు పోలాండ్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా ఆ జట్టు ఆటగాళ్లు వృథా చేసుకున్నారు. అయితే షూటౌట్‌లో మాత్రం గురి తప్పకుండా విజయాన్ని ఖాయం చేసుకున్నారు.
వేల్స్ జోరు...
తొలిసారి యూరో టోర్నమెంట్‌లో ఆడుతోన్న వేల్స్ జట్టు మరో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. నార్తర్న్ ఐర్లాండ్‌తో శనివారం జరిగిన రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో వేల్స్ జట్టు 1-0తో గెలుపొందింది. ఆట 75వ నిమిషంలో నార్తర్న్ ఐర్లాండ్ ఆటగాడు మెకౌలే ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో వేల్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వేల్స్ స్టార్ ప్లేయర్ గ్యారెత్ బేల్ ఆడిన క్రాస్ షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు నుంచి తప్పించబోయిన నార్తర్న్ ఐర్లాండ్ ఆటగాడు మెకౌలే బంతిని తమ గోల్‌పోస్ట్‌లోనికి పంపించడంతో వేల్స్ ఖాతాలో గోల్ చేరింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్ చేసిన బేల్ నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్థి జట్టు సెల్ఫ్ గోల్ చేయడంలో కీలకపాత్ర పోషించడం విశేషం.