ఈడెన్ లో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జి
కోల్ కతా: ఐపీఎల్ 7 విజయోత్సవ వేడుకల్లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఈడెన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తాజా ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ సభ్యులకు స్టేడియంకు రావడానికి ముందే అక్కడకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యే క్రమంలో పోలీసులు అభిమానులపై లాఠీఛార్జికి దిగారు. ఇందులో పలువురు అభిమానులకు తీవ్ర గాయాలైయ్యాయి.
ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మాన ఏర్పాట్లు చేయడం కాస్తా వివాదాలకు దారి తీసింది.