బ్యాటింగ్‌ మెరుపులతో సరికొత్త రికార్డు | Pollards Trinbago Knight Riders Register Third Highest T20 Score | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌ మెరుపులతో సరికొత్త రికార్డు

Published Sat, Sep 14 2019 10:56 AM | Last Updated on Sat, Sep 14 2019 10:58 AM

Pollards Trinbago Knight Riders Register Third Highest T20 Score - Sakshi

జమైకా: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో హ్యాట్రిక్‌ టైటిల్‌పై కన్నేసిన ట్రిన్‌బాగో నైట్‌ రైడ్‌రైడర్స్‌ మరోసారి తన బ్యాటింగ్‌ పవర్‌ చూపిస్తోంది.  డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌..  శుక్రవారం జమైకా తల్హాస్‌తో జరిగిన మ్యాచ్‌లో సరికొత్త బ్యాటింగ్‌ రికార్డు  నెలకొల్పింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ విజృంభించి ఆడింది. ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(20) తొందరగానే పెవిలియన్‌ చేరినప్పటికీ, మరొక ఓపెనర్‌ లెండి సిమ్మన్స్‌(86; 42  బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దాంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అతనికి మున్రో జత కలవడంతో ఇద్దరూ ఎడాపెడా బాదుతూ జమైకా బౌలర్లకు దడపుట్టించారు.

మున్రో(96 నాటౌట్‌; 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) బౌండరీల మోత మోగించాడు.   ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు సిమ్మన్స్‌తో కలిసి 124 పరుగుల్ని జత చేశాడు. అటు తర్వాత కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌(45 నాటౌట్‌; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో నైట్‌రైడర్స్‌ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లుకు 267 పరుగులు చేసింది. ఇది కరీబియన్‌ లీగ్‌లో అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్‌ టీ20ల్లో మూడో అత్యుత్తమంగా నమోదైంది.  ఈ జాబితాలో అఫ్గానిస్తాన్‌ 278 పరుగులతో టాప్‌లో ఉంది.

నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన రికార్డు టార్గెట్‌ను ఛేదించే క్రమంలో జమైకా ధీటుగానే బదులిచ్చినా ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులకు పరిమితమై పరాజయం చెందింది. గేల్‌(39), గ్లెన్‌ ఫిలిప్స్‌(62), జావెల్లె గ్లెన్‌(34 నాటౌట్‌), రామల్‌ లూయిస్‌(37 నాటౌట్‌)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. గత రెండు సీపీఎల్‌ టైటిల్స్‌ను  నైట్‌రైడర్స్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement