![Praneeth And Kashyap Crashed Out Of The China Open Tournament - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/8/kashayp.jpg.webp?itok=3nhbQ9Or)
ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్ సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ సింధు, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా... తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ కూడా వెనుదిరిగారు. గురువారం 84 నిమిషాల పాటు సాగిన ప్రిక్వార్టర్ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 20–22, 22–20, 16–21తో టోర్నీ నాలుగో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌లో నువ్వా–నేనా అన్నట్లు పోరాడటంతో స్కోరు 20–20తో సమమైంది. చివర్లో వరుసగా రెండు పాయింట్లు సాధించిన డెన్మార్క్ షట్లర్ తొలి గేమ్‌ను గెలిచాడు. రెండో గేమ్‌లోనూ ఇద్దరు ఆటగాళ్లు తొలుత హోరాహోరీగా ఆడినప్పటికీ కీలక సమయంలో పాయింట్లు సాధించిన ప్రణీత్ 19–13తో ఆధిక్యంలో నిలిచాడు.
ఈ దశలో తడబడిన ప్రణీత్ వరుసగా 5 పాయింట్లను ప్రత్యర్థికి కోల్పోయి ఆధిక్యాన్ని 19–18కి తగ్గించుకున్నాడు. అనంతరం ప్రణీత్ ఒక పాయింట్, ఆంటోన్సెన్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకోగా స్కోర్ 20–20తో సమమైంది. అయితే ఇక్కడ ఎటువంటి పొరపాటు చేయని ప్రణీత్ రెండు పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో డెన్మార్క్ షట్లర్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మరో ప్రిక్వార్టర్ పోరులో కశ్యప్ 13–21, 19–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌లో ఏ మాత్రం పోటీ ఇవ్వని కశ్యప్ రెండో గేమ్‌లో మాత్రం పోరాడాడు. అయితే 19–17తో ఉన్న సమయంలో ఒత్తిడికి లోనైన కశ్యప్ వరుసగా 4 పాయింట్లను ప్రత్యర్థికి సమర్పించుకొని ఇంటి ముఖం పట్టాడు.
సాత్విక్‌కు మిశ్రమ ఫలితాలు
భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురైయ్యాయి. డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో జత కట్టిన సాయిరాజ్ క్వార్టర్స్ చేరగా... మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం ప్రిక్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయాడు. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం 21–18, 21–23, 21–11తో ఆరో సీడ్ హిరోయుకి ఎండో– యుట వటనాబె (జపాన్) జోడీపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప జంట 21–23, 16–21తో టోర్నీ ఐదో సీడ్ సియో సెయుంగ్ జే– చే యుజుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో టోర్నీ మూడో సీడ్ లి జున్ హుయ్– లియు యున్ చెన్ (చైనా) జంటతో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment