ప్రయర్ ఓ రౌడీ
లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన ఆత్మకథతో మరోసారి వార్తల్లో నిలిచాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు కోచ్ ఆండీ ఫ్లవర్‌పై ‘కేపీ: ది ఆటోబయోగ్ర ఫీ’ పుస్తకంలో విరుచుకుపడ్డాడు. సోమవారం ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. వికెట్ కీపర్ మాట్ ప్రయర్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని చెడగొట్టడంలో ముందుండేవాడని, అతడో రౌడీ అని ఆరోపించాడు. కోచ్ ఫ్లవర్ ఓ నియంతలా వ్యవహరించారని తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5తో ఓడిన అనంతరం పీటర్సన్‌ను జట్టు నుంచి తప్పించారు. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా సూటిగా స్పందించిన దాఖలాలు లేవు. దక్షిణాఫ్రికాలో జన్మించిన కేపీ ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.
అయితే ఇప్పటికీ తనను జట్టులోంచి ఎందుకు తొలగించారనేది అర్థం కావడం లేదని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘ఫీల్డర్లు క్యాచ్‌లు మిస్ చేస్తే సీనియర్ బౌలర్లు స్వాన్, అండర్సన్, బ్రాడ్, కీపర్ ప్రయర్ వారిని తిట్టే విధానం చూసి షాక్ తినేవాణ్ణి. మ్యాచ్ ముగిశాక వారిని క్షమాపణ చెప్పాలని బలవంతం చేసేవారు. ఈ బౌలర్లు ఎప్పుడూ వైడ్ బంతులు వేయలేదా.. ప్రయర్ క్యాచ్‌లు వదిలేయలేదా? అటు ఫ్లవర్ కూడా ఆటగాళ్లను భయంలో ఉంచేవారు. ఈ విషయంపై నేనతన్ని సూటిగానే ప్రశ్నించి నీకు భయపడను అని చెప్పాను’ అని 34 ఏళ్ల పీటర్సన్ వివరించాడు.