Matt Prior
-
క్రికెట్‌కు ప్రయర్ గుడ్‌బై
లండన్ : ఇంగ్లండ్ వికెట్ కీపర్ మాట్ ప్రయర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 11 నెలల కిందట భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఆడిన ప్రయర్... ఆ తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ 7 సెంచరీలతో 4 వేల 99 పరుగులు చేశాడు. 256 అవుట్లలో భాగం పంచుకున్నాడు. 68 వన్డేల్లో 1282 పరుగులు సాధించాడు. -
ప్రయర్ ఓ రౌడీ
లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన ఆత్మకథతో మరోసారి వార్తల్లో నిలిచాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు కోచ్ ఆండీ ఫ్లవర్‌పై ‘కేపీ: ది ఆటోబయోగ్ర ఫీ’ పుస్తకంలో విరుచుకుపడ్డాడు. సోమవారం ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. వికెట్ కీపర్ మాట్ ప్రయర్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని చెడగొట్టడంలో ముందుండేవాడని, అతడో రౌడీ అని ఆరోపించాడు. కోచ్ ఫ్లవర్ ఓ నియంతలా వ్యవహరించారని తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5తో ఓడిన అనంతరం పీటర్సన్‌ను జట్టు నుంచి తప్పించారు. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా సూటిగా స్పందించిన దాఖలాలు లేవు. దక్షిణాఫ్రికాలో జన్మించిన కేపీ ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటికీ తనను జట్టులోంచి ఎందుకు తొలగించారనేది అర్థం కావడం లేదని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘ఫీల్డర్లు క్యాచ్‌లు మిస్ చేస్తే సీనియర్ బౌలర్లు స్వాన్, అండర్సన్, బ్రాడ్, కీపర్ ప్రయర్ వారిని తిట్టే విధానం చూసి షాక్ తినేవాణ్ణి. మ్యాచ్ ముగిశాక వారిని క్షమాపణ చెప్పాలని బలవంతం చేసేవారు. ఈ బౌలర్లు ఎప్పుడూ వైడ్ బంతులు వేయలేదా.. ప్రయర్ క్యాచ్‌లు వదిలేయలేదా? అటు ఫ్లవర్ కూడా ఆటగాళ్లను భయంలో ఉంచేవారు. ఈ విషయంపై నేనతన్ని సూటిగానే ప్రశ్నించి నీకు భయపడను అని చెప్పాను’ అని 34 ఏళ్ల పీటర్సన్ వివరించాడు. -
ప్రయర్ అవుట్...
లండన్: లార్డ్స్ ఓటమి ఇంగ్లండ్ జట్టుపై ప్రభావం చూపించడం మొదలైనట్లుంది. ఓటమి తర్వాత నిర్వేదంలోకి జారిపోయే చాలా మంది ఇంగ్లండ్ క్రికెటర్లలాగే ఇప్పుడు వికెట్ కీపర్ మాట్ ప్రయర్ కూడా వ్యవహరించాడు. ‘గాయం కారణంగా’ సిరీస్‌నుంచి తప్పుకుంటున్నట్లు అతను ప్రకటించాడు. ఫలితంగా మిగిలిన మూడు టెస్టులకూ దూరమయ్యాడు. ‘చేతికి తగిలిన దెబ్బతో పాటు ఇతర గాయాలు సిరీస్‌కు ముందునుంచే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇది కఠిన నిర్ణయమని తెలుసు. అయితే పూర్తి ఫిట్నెస్తో తర్వాతి సీజన్‌కు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఒక ఆటగాడిగా జట్టుకు న్యాయం చేయలేకపోతున్న నేను ఆఖరి టెస్టు కూడా ఆడేశానేమో’ అని ప్రయర్ వ్యాఖ్యానించాడు. -
‘ఆదుకున్న’ బ్రాడ్, ప్రయర్!
లండన్: యాషెస్ సిరీస్ ముగిశాక ఇంగ్లండ్ క్రికెటర్లు ఇంకా జట్టును ఆదుకోవడం ఏముంది అనుకోకండి... ఇది క్రికెట్ మైదానంలో కాదు. నిజజీవితంలో వారు ఒక వ్యక్తిని చనిపోకుండా కాపాడి ఒక్కసారిగా హీరోలయ్యారు. వివరాల్లోకెళితే... సిడ్నీలో చివరి టెస్టు ముగిసిన తర్వాత ఈ ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. డార్లింగ్ హార్బర్ బ్రిడ్జి వద్ద కాసేపు ఆగి వారిద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా దూరంగా ఒక వ్యక్తిపై దృష్టి పడింది. అతను నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లిన వారిద్దరు అతడిని అడ్డుకున్నారు. బ్రిడ్జి అంచుపైనుంచి నదిలో దూకడానికి సిద్ధమైన వ్యక్తిని వెనక్కి లాగారు. తాను చనిపోవాలనుకుంటున్నట్లు ఇంగ్లండ్‌కు చెందిన ఆ వ్యక్తి వెల్లడించాడు. దాంతో అతడిని కూర్చోబెట్టి ప్రయర్ కౌన్సిలింగ్ చేయగా... బ్రాడ్ పోలీసులకు ఫోన్ చేశాడు.