ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు!
బెల్గాం: ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో మరో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ కీరిత్ పంచల్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. గ్రూప్-ఎలో భాగంగా పంజాబ్ తో జరుగుతున్నమ్యాచ్లో గుజరాత్ ఆటగాడు పంచల్ 460 బంతుల్లో 32 ఫోర్ల సాయంతో అజేయంగా ట్రిపుల్ సాధించాడు. తద్వారా పంచల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గుజరాత్ తరపున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. మంగళవారం తొలి రోజు ఆటలో భాగంగా 134 పరుగులతో అజేయంగా నిలిచిన పంచల్.. బుధవారం రెండో రోజు ఆటలో సుదీర్ఘంగా క్రీజ్లో నిలబడి ట్రిపుల్ సాధించి నాటౌట్గా క్రీజ్లో నిలిచాడు.
పంచల్ ట్రిపుల్ సాధించడంతో గుజరాత్ తన తొలి ఇన్నింగ్స్ ను ఆరు వికెట్ల నష్టానికి 624 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అతనికి జతగా మెరాయ్(65), రుజుల్ భట్(60),కెప్టెన్ అక్షర్ పటేల్(65)లు రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పంజాబ్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది.