
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్–6లో పుణేరీ పల్టన్ శుభారంభం చేసింది. సోమవారం జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో రైడర్లు నితిన్ తోమర్ (7 పాయింట్లు), జీబీ మోరే (6), దీపక్ కుమార్ దహియా (5) రాణించడంతో... 34–22తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. హరియాణా జట్టులో వికాస్ కండోలా 8 పాయింట్లతో సత్తా చాటినప్పటికీ అతనికి సహచరుల నుంచి తగిన సహకారం అందలేదు. మ్యాచ్ ఆరంభంలో ఇరుజట్లు పోటాపోటీగా తలపడటంతో పాయింట్లు నెమ్మదిగానే వచ్చాయి. 13వ నిమిషంలో 7–6తో దాదాపు ఇరు జట్లు సమానంగానే ఉన్నాయి. అయితే, మ్యాచ్ సాగిన కొద్ది పట్టు సాధించిన పుణేరి రైడర్లు ఆట 19వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి తొలి అర్ధభాగాన్ని 15–9తో ఆధిక్యంతో ముగించారు.
రెండో అర్ధభాగంలో పుంజుకున్న హరియాణా వరుసగా 5 పాయింట్లు సాధించి 14–18తో రేసులోకి వచ్చింది. పల్టన్ ఆటగాళ్లు 36వ నిమిషంలో స్టీలర్స్‌ను రెండోసారి ఆలౌట్ చేసి 30–17తో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇదే జోరును చివరి వరకు సాగిస్తూ విజయాన్ని అందుకున్నారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌కు ఓటమి ఎదురైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను కంగుతినిపించిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో 32–37తో యూపీ యోధచేతిలో ఓడిపోయింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 12 రైడ్ పాయింట్లతో ఆకట్టుకోగా... ట్యాకిల్‌లో మన్‌జీత్ చిల్లర్ (4 పాయింట్లు) రాణించాడు. యూపీ యోధా తరఫున రైడర్లు ప్రశాంత్ కుమార్ (8), శ్రీకాంత్ (5), రిషాంక్ దేవడిగ (4) క్రమం తప్పకుండా స్కోర్ చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment