పూజారా 18వ 'సారీ'!
ఇండోర్:భారత టెస్టు క్రికెట్లో ద వాల్ రాహుల్ ద్రవిడ్ తరువాత అదే స్థాయిలో జట్టుకు వెన్నుముకగా నిలిచే ఆటగాడు చటేశ్వర పూజారా. బ్యాటింగ్ టెక్నికల్లో ఎంతో పరిణితి కనబరుస్తూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే స్వదేశంలో చటేశ్వర పూజారా అవుటయ్యే క్రమంలో చెత్త రికార్డునే మూట గట్టుకున్నాడు. సాధారణంగా భారత బ్యాట్స్మెన్ స్పిన్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటారనే పేరుంటే.. పూజారా మాత్రం అందుకు భిన్నంగా స్పిన్ బౌలింగ్ లోనే వెనుదిరుగుతున్నాడు.
తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో పూజారా స్పిన్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. కివీస్ స్పిన్నర్ సాంట్నార్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దాంతో స్వదేశీ టెస్టుల్లో 18 సార్లు స్పిన్ బౌలింగ్ లో అవుటైన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇది పూజారా టెస్టు అరంగేట్రం నుంచి లెక్కిస్తే స్వదేశంలో ఇలా అత్యధిక సార్లు అవుటైన ఆటగాడు అతనే కావడం గమనార్హం. ఇప్పటివరకూ స్వదేశీ టెస్టుల్లో పూజారా 18 సార్లు స్పిన్ బౌలింగ్ లో అవుటైతే, 9 సార్లు మాత్రమే పేస్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో పూజారా(41;108 బంతుల్లో 6 ఫోర్లు) మరోసారి రాణించాడు.