పుజారా ప్రత్యేకత అదే
రాంచీ: టీమిండియా బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా కీలక సమయంలో ఒత్తిడిని ఎదుర్కొని రాణించి, ఇతర బాట్స్‌మెన్‌పై భారం పడకుండా వాళ్లు సహజశైలిలో ఆడేలా చేస్తాడని ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో రాంచీ టెస్టులో మూడో రోజు శనివారం పుజారా సెంచరీతో రాణించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడని ప్రశంసించాడు.
ఆటలో ఒత్తిడి ఎదురైనపుడు ఆ భారం పుజారాపై వేసి, మరో ఆటగాడు సహజశైలిలో ఆడవచ్చని విజయ్ అన్నాడు. తామిద్దరం మంచి ఫామ్‌లో ఉన్నామని, ఇది జట్టు పటిష్ట స్థితిలో నిలవడానికి ఉపయోగపడిందని చెప్పాడు. రాంచీ టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగులు చేయగా.. భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 360/6 స్కోరు చేసింది. సెంచరీ వీరుడు పుజారా (130 బ్యాటింగ్), సాహా (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుజరా, విజయ్ రెండో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం సాధిస్తే మ్యాచ్ చేతిలోకి వస్తుందని విజయ్ చెప్పాడు.