న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అండర్–17 బాలుర సింగిల్స్‌లో మైస్నమ్ మెరాబా రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా... పుల్లెల గాయత్రి అండర్–17, అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో పోరాడి ఓడిపోయింది. మయన్మార్‌లో బుధవారం మొదలైన ఈ పోటీల్లో మైస్నమ్ తొలి రౌండ్‌లో 21–10, 21–13తో షున్ యాంగ్ లీ (మలేసియా)పై విజయం సాధించాడు. గాయత్రి అండర్–17 విభాగం తొలి రౌండ్‌లో 20–22, 21–18, 13–21తో యస్నితా ఎంగిరా సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో... అండర్–15 విభాగం తొలి రౌండ్‌లో 22–24, 21–14, 15–21తో విద్‌జాజా స్టెఫానీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది.
అండర్–17 బాలికల సింగిల్స్ మరో మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి 9–21, 19–21తో నూర్ స్యాజా రషీది (మలేసియా) చేతిలో ఓటమి చవిచూసింది. అండర్–17 బాలికల డబుల్స్ తొలి రౌండ్‌లో మోపాటి కెయుర–సెల్వం కవిప్రియ ద్వయం 21–9, 21–4తో దిల్మీ దియాస్–అనురాంగి మసకోరాలా (శ్రీలంక) జోడీపై విజయం సాధించింది. ఇదే విభాగంలో పుల్లెల గాయత్రి–సామియా ఇమాద్ ఫారూఖి జంటకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment