Junior Badminton Championship
-
అదరగొట్టిన ఆంధ్ర ప్లేయర్లు: భార్గవ్‌కు రెండు టైటిల్స్
పుణే: ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు అరిగెల భార్గవ్ రామ్ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన భార్గవ్ అండర్–19 పురుషుల డబుల్స్, అండర్–19 మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు.డబుల్స్లోనూపురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన గొబ్బూరు విశ్వతేజ్‌తో కలిసి ఆడిన భార్గవ్ రామ్ 21–13, 21–18తో అర్ష్ మొహమ్మద్–భవ్య్ ఛాబ్రా (భారత్) జోడీని ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో భార్గవ్‌రామ్–కలగొట్ల వెన్నెల (భారత్) ద్వయం 21–9, 21–12తో మొహమ్మద్ వితో అనాఫ్సా–కేలా అనీసా పుత్రి (ఇండోనేసియా) జంటను ఓడించి టైటిల్ దక్కించుకుంది.చాంపియన్ సూర్య చరిష్మాఇక అండర్–19 మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సూర్య చరిష్మా తామిరి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సూర్య చరిష్మా 18–21, 21–11, 21–15తో థాలిత రమధాని విర్యావాన్ (ఇండోనేసియా)పై గెలుపొందింది. అండర్–19 మహిళల డబుల్స్ ఫైనల్లో తారిణి సూరి–శ్రావణి వలేకర్ (భారత్) జంట 21–17, 23–21తో చైచానా–పొలియం (థాయ్‌లాండ్) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. -
చరిత్రకు చేరువలో భారత షట్లర్
సాంటెండర్ (స్పెయిన్): మూడు దశాబ్దాల ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో అండర్–19 పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేందుకు తమిళనాడు టీనేజర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ విజయం దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 18 ఏళ్ల శంకర్ 21–13, 21–15తో పనిత్చాపోన్ తీరారత్సకుల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)తో శంకర్ తలపడతాడు. ఫైనల్ చేరే క్రమంలో ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన శంకర్ తన ప్రత్యర్థులకు కేవలం ఒక గేమ్ మాత్రమే కోల్పోయాడు. -
53ఏళ్ల తర్వాత స్వర్ణపతకం సాధించిన లక్ష్య సేన్
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార లక్ష్య సేన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. 53 ఏళ్ల విరామం తర్వాత పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచిన షట్లర్‌గా గుర్తింపు పొందాడు. జకార్తాలో ఆదివారం జరిగిన అండర్–19 పురుషుల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్ వరుస గేముల్లో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. జకార్తా (ఇండోనేసియా): ఆద్యంతం తన సంచలన ప్రదర్శన కొనసాగించిన భారత బ్యాడ్మింటన్ యువస్టార్ లక్ష్య సేన్ ఆసియా జూనియర్ చాంపియన్ షిప్లో విజేతగా అవతరించాడు. ఆదివారం అండర్–19 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ లక్ష్య సేన్ 21–19, 21–18తో టాప్ సీడ్, ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. టైటిల్ గెలిచే క్రమంలో లక్ష్య సేన్ నలుగురు సీడెడ్ క్రీడాకారులపై నెగ్గడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ సరన్ జామ్శ్రీ (థాయ్‌లాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ లీ షిఫెంగ్ (చైనా)పై, సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఇక్షన్ రుమ్బే (ఇండోనేసియా)పై, ఫైనల్లో టాప్ సీడ్ కున్లావుత్‌పై లక్ష్య సేన్ గెలుపొందాడు. వరుసగా మూడో ప్రయత్నంలో లక్ష్య సేన్ ఖాతాలో ఆసియా స్వర్ణ పతకం చేరడం విశేషం. 2016లో కాంస్యం నెగ్గిన అతను గతేడాది ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఈసారి మాత్రం ఏకంగా టైటిల్ కొల్లగొట్టాడు. నిలకడగా ఆడుతూ... ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన 16 ఏళ్ల లక్ష్య సేన్ కుటుంబానికి బ్యాడ్మింటన్ నేపథ్యం ఉంది. లక్ష్య సేన్ సోదరుడు చిరాగ్ సేన్ అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా... తండ్రి డీకే సేన్ బ్యాడ్మింటన్ కోచ్‌గా ఉన్నారు. తాత చంద్రలాల్ సేన్ ప్రోత్సాహంతో తొమ్మిదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. 2014లో స్విస్ ఓపెన్ జూనియర్ చాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచ్చిన లక్ష్య సేన్ అదే ఏడాది డెన్మార్క్‌లో జరిగిన టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన అతను గతేడాది జూనియర్ ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. అంతేకాకుండా జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ‘బాయ్’ నజరానా రూ. 10 లక్షలు... ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచిన లక్ష్య సేన్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. ‘ఆసియా టైటిల్ గెలిచి లక్ష్య సేన్ దేశం మొత్తం గర్వపడేలా చేశాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారు కూడా మంచి ఫలితాలు సాధిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. భారత్ తరఫున 1965లో గౌతమ్ ఠక్కర్ (మహారాష్ట్ర) పురుషుల సింగిల్స్‌లో తొలిసారి ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచాడు. అనంతరం సమీర్ వర్మ 2011లో రజతం, 2012లో కాంస్యం... 2016లో లక్ష్య సేన్ కాంస్యం గెలిచారు. 2009లో ప్రణవ్ చోప్రా–ప్రజక్తా సావంత్ ద్వయం మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం గెలిచింది. 2011లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో కాంస్యం, 2012లో స్వర్ణ పతకం సాధించింది. ఆసియా టోర్నీలో టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎనిమిది రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో తొలుత టీమ్ ఈవెంట్లో, ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పోటీపడ్డాను. క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్‌ను ఓడించాక టైటిల్ సాధిస్తాననే నమ్మకం పెరిగింది. టోర్నీ సందర్భంగా కాలి కండరాల గాయమైంది. నొప్పి నివారణ మాత్రలు తీసుకుంటూ మ్యాచ్‌లు కొనసాగించాను. –లక్ష్య సేన్ -
భారత్ శుభారంభం
జకార్తా: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన టీమ్ ఈవెంట్ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో కజకిస్తాన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ 21–5, 21–4తో ఇయా గోర్డెయెవా (కజకిస్తాన్)పై గెలిచి 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–15, 21–12తో దిమిత్రీ పనరిన్‌పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో సిమ్రన్ సింఘి–రితిక ద్వయం 21–7, 21–8తో ఇయా గొర్డెయెవా–అయేషా జంటపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌లో మన్జీత్ సింగ్–డింకూ సింగ్ జోడీ 21–5, 21–16తో అబ్దుల్లాయెవ్–తజిబుల్లాయెవ్ ద్వయంపై విజయం సాధించగా... చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సృష్టి జూపూడి–శ్రీ కృష్ణ సాయి జంట 21–7, 21–9తో దిమిత్రీ–అయేషా జుమాబెక్‌పై గెలిచి 5–0తో విజయాన్ని పరిపూర్ణం చేశారు. -
పోరాడి ఓడిన గాయత్రి
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అండర్–17 బాలుర సింగిల్స్‌లో మైస్నమ్ మెరాబా రెండో రౌండ్లోకి ప్రవేశించగా... పుల్లెల గాయత్రి అండర్–17, అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో పోరాడి ఓడిపోయింది. మయన్మార్‌లో బుధవారం మొదలైన ఈ పోటీల్లో మైస్నమ్ తొలి రౌండ్లో 21–10, 21–13తో షున్ యాంగ్ లీ (మలేసియా)పై విజయం సాధించాడు. గాయత్రి అండర్–17 విభాగం తొలి రౌండ్లో 20–22, 21–18, 13–21తో యస్నితా ఎంగిరా సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో... అండర్–15 విభాగం తొలి రౌండ్లో 22–24, 21–14, 15–21తో విద్జాజా స్టెఫానీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. అండర్–17 బాలికల సింగిల్స్ మరో మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి 9–21, 19–21తో నూర్ స్యాజా రషీది (మలేసియా) చేతిలో ఓటమి చవిచూసింది. అండర్–17 బాలికల డబుల్స్ తొలి రౌండ్లో మోపాటి కెయుర–సెల్వం కవిప్రియ ద్వయం 21–9, 21–4తో దిల్మీ దియాస్–అనురాంగి మసకోరాలా (శ్రీలంక) జోడీపై విజయం సాధించింది. ఇదే విభాగంలో పుల్లెల గాయత్రి–సామియా ఇమాద్ ఫారూఖి జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
సాయివిష్ణు జంటకు టైటిల్
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పుల్లెల సాయివిష్ణు సత్తా చాటాడు. శేరిలింగంపల్లిలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో బాలుర సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన అండర్–15 బాలుర సింగిల్స్ ఫైనల్లో జి. ప్రణవ్ రావు ‘వాకోవర్’ ఇవ్వడంతో సాయివిష్ణు విజేతగా నిలిచాడు. బాలుర డబుల్స్ ఫైనల్లో పి. సాయివిష్ణు–జి. ప్రణవ్ రావు (రంగారెడ్డి) ద్వయం 21–12, 21–18తో కె. భార్గవ రెడ్డి (ఖమ్మం)–పి. సాకేత్ రెడ్డి (నల్లగొండ) జంటపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. బాలికల సింగిల్స్ విభాగంలో ఎం. మేఘనా రెడ్డి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మేఘన (హైదరాబాద్) 21–15, 19–21, 21–15తో ఎ. అభిలాష (హైదరాబాద్)పై నెగ్గింది. డబుల్స్ ఫైనల్లో ఎ. శిఖా–కె. భార్గవి (రంగారెడ్డి) జంట 21–11, 21–14తో కె. శ్రేష్టా రెడ్డి–ఎస్. వైష్ణవి (హైదరాబాద్) జోడీపై విజయం సాధించింది. విజేతలకు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ట్రోఫీలను అందజేశారు. అండర్–17 విజేతల వివరాలు: బాలుర సింగిల్స్ ఫైనల్స్: ఎం. తరుణ్ (ఖమ్మం) 22–20, 21–19తో పి. విష్ణు వర్ధన్ గౌడ్ (రంగారెడ్డి)పై గెలుపొందాడు. డబుల్స్ ఫైనల్స్: నవనీత్ (మెదక్)–పి. విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) ద్వయం 23–21, 21–13తో కె. ప్రశాంత్–ఎం. తరుణ్ (ఖమ్మం) జంటపై గెలుపొందింది. బాలికల సింగిల్స్: కేయూర మోపాటి (హైదరాబాద్) 21–16, 18–21, 21–15తో ఎం. మేఘనా రెడ్డి (హైదరాబాద్)పై నెగ్గింది. డబుల్స్ ఫైనల్స్: జి. శ్రీవిద్య–వై. సాయి శ్రీయ (మెదక్) జంట 21–10, 21–13తో ఆశ్రిత (ఖమ్మం)–పూజిత (రంగారెడ్డి) జోడీపై గెలిచింది. -
మూడో రౌండ్లో రుత్విక
అలోర్ సెటార్ (మలేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన రుత్విక... సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 21-9, 21-6తో కిట్ లెంగ్ వాంగ్ (మకావు)పై విజయం సాధించింది. మంగళవారం జరిగే మూడో రౌండ్లో నత్సుకి నిదైరా (జపాన్)తో రుత్విక తలపడుతుంది. భారత్‌కే చెందిన రేష్మా కార్తీక్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. రేష్మా 12-21, 16-21తో బ్రిట్నీ టామ్ (కెనడా) చేతిలో ఓటమి పాలైంది. ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల విభాగాలలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న వారు ఈ ఏడాది ఆగస్టులో 16 నుంచి 28 వరకు చైనాలో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు.