చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పుణే వారియర్స్ ఫ్రాంచైజీ ఉండేది.. లేనిది నేడు (శనివారం) జరిగే బీసీసీఐ వర్కింగ్ కమిటీలో తేలనుంది. ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా గత మేలో బోర్డు... పుణే ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీ మొత్తాన్ని సొమ్ము చేసుకుంది. దీంతో ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని సహారా గ్రూప్ నిర్ణయించుకుంది. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేసినప్పటికీ బీసీసీఐకి మాత్రం తమ ఉద్దేశాన్ని చెప్పలేదు. సాంకేతికంగా పుణే జట్టు ఇంకా ఐపీఎల్‌లో ఉన్నప్పటికీ వచ్చే సీజన్‌లో బరిలో ఉండేదుకు రూ.170.2 కోట్ల బ్యాంకు గ్యారెంటీని ఇప్పటిదాకా సమకూర్చలేదు.
గత ఐదు నెలలుగా ఈ మొత్తంపై సహారా గ్రూప్‌నకు బీసీసీఐ గుర్తు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీ భవితవ్యం తేల్చేందుకు ఐపీఎల్ పాలకమండలి సభ్యులంతా వర్కింగ్ కమిటీకి అందుబాటులో ఉండాలని బోర్డు ఆదేశించింది. ‘వారికి జట్టును నడపాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. బ్యాంకు గ్యారెంటీని సొమ్ము చేసుకున్నప్పటికీ వచ్చే సీజన్‌లో ఉండేందుకు మరోసారి గ్యారెంటీ సొమ్మును జమ చేసేందుకు వారికే మాత్రం ఆసక్తి లేదు’ అని ఐపీఎల్ అధికారి ఒకరు తెలిపారు. నేటి కమిటీలో చర్చించిన తర్వాత పుణే జట్టుకు 30 రోజుల ఉద్వాసన నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్ నుంచి పుణే అవుట్!
Published Sat, Oct 26 2013 1:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement