లాంఛనం ముగిసింది
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పుణే వారియర్స్ కథ ముగిసింది. ఈ ఫ్రాంచైజీని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. శనివారం చెన్నైలో జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. లీగ్‌లో కొనసాగాలంటే బ్యాంకు పూచీకత్తు సొమ్మును జమ చేయాల్సిందిగా బోర్డు పలుమార్లు గుర్తు చేసినా సహారా స్పందించకపోవడంతో వారి జట్టును తప్పించేందుకే నిర్ణయించారు. ఈ సమావేశానికి ఐపీఎల్ పాలక మండలి సభ్యులు కూడా హాజరయ్యారు. ఓవరాల్‌గా ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిన మూడో జట్టుగా పుణే పేరు తెచ్చుకుంది.
గతంలో వివిధ కారణాల రీత్యా కొచ్చి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్‌పై కూడా వేటు పడింది. దీంతో ఇక ఐపీఎల్‌లో ఎనిమిది జట్లే మిగిలాయి. రాబోయే సీజన్‌కు సిద్ధం కావాలంటే పుణే జట్టుపై ఏదో ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని బోర్డు అభిప్రాయపడింది. ‘2014 సీజన్‌లో పుణే ఫ్రాంచైజీ బరిలో ఉండాలంటే రూ.170.2 కోట్ల బ్యాంకు పూచీకత్తు సొమ్మును గత మార్చిలోనే జమ చేయాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఇప్పటికి ఐదు సార్లు ఈ విషయమై వారికి గుర్తు చేశాం. అయినా స్పందన లేదు. అందుకే బోర్డు వారి బ్యాంకు పూచీకత్తును సొమ్ము చేసుకుంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ పేర్కొన్నారు.
విభేదాలు మొదలయ్యాయిలా...
ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా ఐపీఎల్ ఆరో సీజన్ కోసం సహారా బ్యాంకు పూచీకత్తును బోర్డు సొమ్ము చేసుకోవడంతో ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అప్పుడే ఐపీఎల్ నుంచి తాము తప్పుకుంటున్నట్టు సహారా ప్రకటించింది. అయితే బోర్డుకు మాత్రం అధికారికంగా చెప్పలేదు. మరోవైపు మ్యాచ్‌ల సంఖ్య తగ్గించడంతో తమకు ఆర్థికంగా నష్టం చేకూరుతుంది కాబట్టి ఫ్రాంచైజీ ఫీజు తగ్గించాలని సహారా వాదించింది. ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు భావించినా ఫలితం లేకపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే పుణే వారియర్స్ అత్యంత ఖరీదైన (రూ.1702 కోట్లు) జట్టుగా ఉండడంతో... ఈ నిర్ణయంతో అటు బీసీసీఐకి కూడా ఆర్థికంగా నష్టం కలుగనుంది.
బోర్డు నమ్మకద్రోహం చేసింది
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి తమ జట్టును తీసేయడంతో సహారా గ్రూప్ బీసీసీఐపై ధ్వజమెత్తింది. బోర్డు నమ్మక ద్రోహానికి పాల్పడడమే కాకుండా ఎప్పుడూ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేదని ఆరోపించింది.