పుణె వారియర్స్పై బీసీసీఐ వేటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో వికెట్ పడింది. కోచి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్ బాటలో పుణె వారియర్స్ కథ ముగిసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పుణెతో ఒప్పందాన్ని రద్దు చేసింది. బ్యాంక్ పూచికత్తును సమర్పించని కారణంగా పుణెపై వేటు వేసింది. శనివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు 30 రోజుల ఉద్వాసన నోటీసును పుణెకు జారీ చేసింది. కాగా బోర్డుతో విబేధాల కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్టు పుణె యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. ఐపీఎల్లో ప్రస్తుతం ఎనిమిది జట్లే మిగిలాయి.
2010 సీజన్లో సహారా గ్రూపు భారీ మొత్తానికి జట్టును కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం 18 మ్యాచ్లకు బదులు 16 మ్యాచ్లే ఆడిస్తుండటంతో ఫీజు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా పుణె ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీని బోర్డు సొమ్ము చేసుకుంది. అనంతరం ఐపీఎల్ నుంచి వైదొలగనున్నట్టు పుణె యాజమాన్యం ప్రకటించినా బోర్డుకు ఈ విషయాన్ని తెలియజేయలేదు. వచ్చే సీజన్లో పుణె ఆడాలంటే 170.2 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని సమకూర్చాలని బోర్డు తెలియజేసింది. పుణె యాజమాన్యం స్పందించకపోవడంతో వేటు వేయాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించింది.