న్యూఢిల్లీ: దేశంలోని క్రికెట్ వీరాభిమానులకు సంతోషకర వార్త. తరలింపు ఊహాగానాలకు తెరదించుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2019) ఈ ఏడాది పూర్తిగా భారత్‌లోనే జరుగనుంది. అత్యంత జనాకర్షక టోర్నీ 12వ ఎడిషన్‌కు మార్చి 23న తెరలేవనుంది. వినోద్ రాయ్, డయానా ఎడుల్జీలతో కూడిన ఇద్దరు సభ్యుల క్రికెట్ పాలకుల మండలి (సీఓఏ) మంగళవారం ఇక్కడ సమావేశమై బీసీసీఐ తరఫున ఈ మేరకు ప్రకటించింది.
ఎన్నికలకు అడ్డు రాకుండా...
సహజంగా ఐపీఎల్ ఏటా ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై మే చివరి వారంలో ముగుస్తుంది. అయితే, ఈసారి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో లీగ్‌ను దక్షిణాఫ్రికా, యూఏఈలకు తరలిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. మే 30 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుండటం షెడ్యూల్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో రెండింటికీ అడ్డురాకుండా చూసుకుంటూనే టోర్నీని స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ తీర్మానించుకుంది. అందులో భాగంగానే దాదాపు 20 రోజుల ముందే లీగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘మ్యాచ్‌ల కోసం అన్ని ప్రాథమిక వేదికలతో పాటు ప్రత్యామ్నాయ వేదికల జాబితానూ సిద్ధం చేశాం. వీవీఐపీల ఎన్నికల ప్రచారం, పోలింగ్ వంటి కారణాలతో ఇబ్బంది తలెత్తితే మార్పు కోసమే ఈ ఏర్పాటు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, భద్రతా వర్గాలనూ సంప్రదించాం’ అని రాయ్ తెలిపారు. ఖరారైన వేదికల సమాచారం, మ్యాచ్‌ల తేదీలను ప్రభుత్వ వర్గాలను సంప్రదించాక ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫ్రాంచైజీలతో విస్తృతంగా చర్చించి షెడ్యూల్ విడుదల చేస్తామని వివరించారు.
ఫైనల్ మే 12–15 మధ్య...
ఊహాగానాల ప్రకారం 8 ప్రధాన... 4 లేదా 6 ప్రత్యామ్నాయ వేదికల వివరాలతో షెడ్యూల్ ఫిబ్రవరి తొలి వారంలో విడుదలవుతుంది. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించాక అవసరాన్ని బట్టి వీటిలో మార్పు చేర్పులు చేస్తుంది. ఎప్పటిలాగే డిఫెండింగ్ చాంపియన్ సొంత మైదానంలో ప్రారంభ, ముగింపు మ్యాచ్‌లు ఉంటాయి. దీని ప్రకారం ఈసారి తొలి మ్యాచ్ చెన్నైలో జరుగనుంది. మే 12 నుంచి 15వ తేదీ మధ్య ఫైనల్ జరిగే అవకాశం ఉంది. అయితే, ఇది కూడా పోలింగ్ తేదీలపై ఆధారపడి ఉంటుంది. దీనికి తగ్గట్లుగా సిద్ధంగా ఉండమని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు, ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మార్పు తప్పింది...
సాధారణ ఎన్నికల కారణంగానే 2009లో లీగ్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో సగ భాగం యూఏఈలో జరిగింది. ఇప్పుడు కూడా పలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఆలోచించారు. చివరకు ఇక్కడే నిర్వహించేందుకు మొగ్గుచూపారు.
విదేశీ ఆటగాళ్ల అందుబాటెంతో?
వన్డే ప్రపంచ కప్ మే 30 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ఐపీఎల్ ప్రపంచకప్‌కు 15 రోజుల ముందే ముగుస్తుంది. తమ జట్లను ప్రపంచ కప్‌నకు సంసిద్ధం చేయాలని ఆయా దేశాలు భావిస్తాయి. ఇప్పటికే న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ మినహా మిగతా దేశాలన్నీ లీగ్ నుంచి ముందుగానే రావాలని తమ ఆటగాళ్లకు సూచనలిచ్చాయి. ఈ నేపథ్యంలో టోర్నీ చివరకు వచ్చేసరికి విదేశీ ఆటగాళ్ల అందుబాటు ఎంతవరకు ఉంటుందో అనే అనుమానం నెలకొంది.
పుట్టింట్లోనే టి20 పండుగ
Published Wed, Jan 9 2019 12:15 AM | Last Updated on Wed, Jan 9 2019 12:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment