terminate
-
24 వారాలకు అబార్షన్
న్యూఢిల్లీ: కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉన్న 20 వారాల అబార్షన్‌ను 24 వారాలకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. 20 వారాల గర్భవిచ్చిత్తి అంటే శిశువును చంపేయడమేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవివాహిత అనే కారణం చూపుతూ పిటిషనర్ వినతిని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లైంగిక హింస వంటి కేసుల్లో గర్భం దాల్చిన ఒంటరి మహిళలు 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునేందుకు ప్రస్తుతం చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. గర్భం దాల్చిన అనంతరం అందుకు కారకుడైన వ్యక్తితో సంబంధాల్లో మార్పు వచ్చినందున అబార్షన్‌కు అనుమతివ్వాలంటూ ఓ మహిళ ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లవకుండానే గర్భం దాల్చిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుందని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కొట్టివేశారు. అవివాహిత అయి, సమ్మతితోనే గర్భం దాల్చిందని, 20 వారాల పిండాన్ని తీసేయడమంటే శిశువును చంపేయడమేనని ఆయన అన్నారు. ‘‘ఒక మంచి ఆస్పత్రిలో చేరి, బిడ్డను కని వదిలేసి వెళ్లిపోవచ్చు. దత్తత తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా ప్రభుత్వం/ ఆస్పత్రి చూసుకుంటాయి. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించకుంటే నేనే భరిస్తా’అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన త్రిసభ్య ధర్మాసనం..హైకోర్టు తీర్పు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్–1971కు విరుద్ధమని పేర్కొంది. -
ట్విటర్ డీల్: ఈలాన్ మస్క్ మరో బాంబు
సాక్షి, న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, బిలియనీర్ ఈలాన్ మస్క్ మరోసారి ట్విటర్‌కు హెచ్చరిక జారీ చేశాడు. స్పామ్, నకిలీ ఖాతాలపై డేటా అందించకపోతే ట్విటర్ కొనుగోలు డీల్‌ను విరమించుకుంటానంటూ తాజాగా హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా ట్విటర్‌కు సోమవారం ఒక లేఖ రాశాడు. విలీన ఒప్పందం ప్రకారం ట్విటర్ వివరాలను వెల్లడించడంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదని, దీంతో తామడిగిన డేటాను అడ్డుకుంటోందనే అనుమానం మరింత కలుగుతోందని లేఖలో మస్క్ వ్యాఖ్యానించాడు. తాము కోరిన డేటాను నిలిపివేయడం సంస్థ తన సమాచార హక్కులను తీవ్రంగా ప్రతిఘటిస్తోందని, అడ్డుకుంటోందని మస్క్ భావిస్తున్నారని మస్క్ లాయర్లు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన అని ఈనేపథ్యంలో డీల్ రద్దు చేయడంసహా అన్ని హక్కులు తమకున్నాయని పేర్కొన్నారు. కాబోయే యజమానిగా కంపెనీ వ్యాపార స్వాధీనం, లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసుకునేందుకు ట్విటర్ యాక్టివ్ యూజర్ల బేస్ గురించి పూర్తి, ఖచ్చితమైన అవగాహన ఉండాలని లేఖ స్పష్టం చేసింది. ట్విటర్ కొనుగోలు కోసం హెచ్ఎస్ఆర్ చట్టం కింద నిరీక్షణ వ్యవధి ముగిసిందని ట్విటర్ తెలిపిన దాదాపు వారం తర్వాత టెస్లా సీఈవో ఈ లేఖను రాయడం గమనార్హం. మరోవైపు ఈ మస్క్ లేఖపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. కాగా ట్విటర్లో నకిలీ ఖాతాలు మొత్తం యూజర్‌బేస్‌లో 5 శాతం కంటే తక్కువ ఉన్నారో లేదో నిర్ధారించుకునేదాకా 44 బిలియన్ డాలర్ల డీల్‌ను "తాత్కాలికంగా హోల్డ్"లో ఉంచుతున్నట్లు మే 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విటర్ యూజర్లలో 5 శాతం వరకు నకిలీ ఖాతాలున్నాయా? లేదా? అనేది ధృవీకరించుకునేందుకు స్వతంత్ర విశ్లేషణను కోరింది. కంపెనీ చట్టాలు, టెస్టింగ్ మెథడాలజీలు సరిపోతాయని నమ్మడం లేదు కాబట్టి తాను తప్పనిసరిగా ఉండాలనేది మస్క్ డిమాండ్. తాజా లేఖ నేపథ్యంలో ట్రేడింగ్‌లో ట్విటర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. -
'గే' లపై కామెంట్స్‌తో కాంట్రాక్ట్ పోయే..
మనీలా: స్వలింగ సంపర్కులు జంతువుల కన్నా నీచం అని వ్యాఖ్యానించి తరువాత క్షమాపణలు చెప్పిన ఫిలిప్పీన్స్ బాక్సర్ ఫకియావ్తో తమ కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వేర్ కంపెనీ నైక్ ప్రకటించింది. పకియావ్ చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని, ఇలాంటి వివక్ష పూరిత వ్యాఖ్యలను తమ సంస్థ ఏ మాత్రం సహించబోదని నైక్ ఓ ప్రకటనను విడుదల చేసింది. లింగవివక్ష ఎదుర్కొంటున్న కమ్యూనిటీకి తమ సంస్థ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన పకియావ్ ఓ టీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తరువాత బైబిల్ చెబుతున్న విషయాన్నే నేను చెబుతున్నానని సమర్థించుకున్నా ఆయనపై విమర్శల పర్వం ఆగలేదు. ప్రస్తుతం పకియావ్ ఫిలిప్పీన్స్‌లో సెనేటర్ స్థానం కోసం పోటీలో ఉన్నాడు. -
పుణె వారియర్స్‌పై బీసీసీఐ వేటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో వికెట్ పడింది. కోచి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్ బాటలో పుణె వారియర్స్ కథ ముగిసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పుణెతో ఒప్పందాన్ని రద్దు చేసింది. బ్యాంక్ పూచికత్తును సమర్పించని కారణంగా పుణెపై వేటు వేసింది. శనివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు 30 రోజుల ఉద్వాసన నోటీసును పుణెకు జారీ చేసింది. కాగా బోర్డుతో విబేధాల కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్టు పుణె యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. ఐపీఎల్లో ప్రస్తుతం ఎనిమిది జట్లే మిగిలాయి. 2010 సీజన్లో సహారా గ్రూపు భారీ మొత్తానికి జట్టును కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం 18 మ్యాచ్‌లకు బదులు 16 మ్యాచ్‌లే ఆడిస్తుండటంతో ఫీజు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఫ్రాంచైజీ ఫీజు చెల్లించని కారణంగా పుణె ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీని బోర్డు సొమ్ము చేసుకుంది. అనంతరం ఐపీఎల్ నుంచి వైదొలగనున్నట్టు పుణె యాజమాన్యం ప్రకటించినా బోర్డుకు ఈ విషయాన్ని తెలియజేయలేదు. వచ్చే సీజన్లో పుణె ఆడాలంటే 170.2 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని సమకూర్చాలని బోర్డు తెలియజేసింది. పుణె యాజమాన్యం స్పందించకపోవడంతో వేటు వేయాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించింది.