పుణె ఫీల్డింగ్: ముంబై బ్యాటింగ్
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. దాంతో ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. గతేడాది ఐపీఎల్లోకి అడుగుపెట్టిన పుణె ఆ సీజన్ లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. చివర నుంచి రెండో స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ఈసారి ఎలాగైనా ఆది నుంచి కచ్చితమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని పుణె యోచిస్తోంది. మరొకవైపు ముంబై కూడా ఏ మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోకూడదనే భావనలోనే ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంచితే, ఐపీఎల్ ఓవరాల్ సీజన్ లో అద్భుమైన సారథిగా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ.. తొలిసారి కెప్టెన్సీ లేకుండా ఈ లీగ్ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. తర్వాత ఆ జట్టు రద్దు కావడం, ధోనీ పుణె జట్టుకు వెళ్లడం తెలిసిందే. ఐపీఎల్ తొమ్మిదో సీజన్ లో పుణె కు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని.. పదో సీజన్ లో సాధారణ పాత్రకే పరిమితం కానున్నాడు.
ముంబై తుది జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), పార్దీవ్ పటేల్, అంబటి రాయడు,పొలార్డ్, నితీష్ రానా, బట్లర్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, బుమ్రా, సౌథీ, మెక్‌క్లాన్‌గన్
పుణె తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, మనోజ్ తివారీ, ఎంఎస్ ధోని,స్టోక్స్, భాటియా,చాహర్, జంపా,ఏబీ దిండా,ఇమ్రాన్ తాహీర్