హార్దిక్ పాండ్యా చితక్కొట్టుడు..
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఓ దశలో తడబడినప్పటికీ చివరకు తేరుకుని గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(35 నాటౌట్;15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీల మోత మోగించాడు.
ఇన్నింగ్స్ 16 ఓవర్ లో్ నితీష్ రానా ఆరో వికెట్ గా అవుటైన తరువాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా తొలుత నెమ్మదిగా ఆడాడు. తొలి తొమ్మిది బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా.. ఆఖరి ఓవర్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 20.0 ఓవర్ లో 28 పరుగులు పిండుకుని ముంబైను పటిష్ట స్థితికి చేర్చాడు.
పుణె బౌలర్ అశోక్ దిండా వేసిన చివర ఓవర్ లో నాలుగు సిక్సర్లు, ఫోర్ తో స్కోరును పరుగులు పెట్టించాడు. ఇందులో వరుసగా కొట్టిన మూడు సిక్సర్లు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. మిగతా ముంబై ఆటగాళ్లలో జాస్ బట్లర్(38), పార్ధీవ్ పటేల్(19),నితీష్ రానా(34), పొలార్డ్(30)లు ఫర్వాలేదనిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
తాహీర్ మ్యాజిక్..
పుణె సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఆది నుంచి ముంబై ఇండియన్స్ కు చెమటలు పట్టించిన తాహీర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 పరుగులతో పటిష్టంగా కనిపించిన ముంబైను పుణె బౌలర్ ఇమ్రాన్ తాహీర్ కట్టడి చేశాడు. ప్రధానంగా తాహీర్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ లో బంతి వ్యవధిలో తాహీర్ రెండు వికెట్లు తీశాడు. ఇక్కడ తొలి మూడు వికెట్లు తాహీర్ ఖాతాలో చేరడం విశేషం. పార్ధీవ్ పటేల్, రోహిత్ శర్మ, జాస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్ల వికెట్లను తాహీర్ సాధించి పుణెకు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఈ ఐపీఎల్ వేలంలో తాహీర్ ను ఏ ఫ్రాంచైజీ కొనగోలు చేయడానికి ముందుకు రాని సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజులు ముందు ఈ నంబర్ వన్ వన్డే బౌలర్ ను పుణె జట్టులోకి తీసుకుంది. ఆ ఆశల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్ లోనే తన ప్రతాపాన్ని చూపించాడు తాహీర్. అతనికి జతగా భాటియా రెండు వికెట్లు తీయగా, జంపా, బెన్ స్టోక్స్ లకు తలో వికెట్ దక్కింది.