చాంగ్‌జౌ (చైనా): ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-12, 13-21, 19-21 తేడాతో పోర్న్‌పావే చూచూవోంగ్(థాయిలాండ్) చేతిలో పరాజయం చెందారు. దాంతో మరో టైటిల్‌ను సాధించాలనుకున్న సింధు ఆశలు నెరవేరలేదు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్‌ల్లో విఫలమయ్యారు. రెండో గేమ్‌లో పుంజుకున్న చూచూవోంగ్ ఆ గేమ్‌ను గెలిచి రేసులో నిలిచారు. అదే ఊపును మూడో గేమ్‌లో కొనసాగించారు.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు పోరాడినా గేమ్‌ను కోల్పోయారు. దాంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ సింధు 21–18, 21–12తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. 50 నిమిషాలకు పైగా సాగిన రెండో రౌండ్ ఆరంభంలో సింధు ఆకట్టుకున్నప్పటికీ తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. రెండో గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయిన సింధు.. మూడో గేమ్‌లో మాత్రం కడవరకూ పోరాడినా ఫలితం దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment