ప్రిక్వార్టర్స్‌కు సింధు.. సైనా ఇంటిబాట | China Open PV Sindhu Reach Pre Quarterfinals Saina Out | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌కు సింధు.. సైనా ఇంటిబాట

Published Wed, Sep 18 2019 10:13 PM | Last Updated on Wed, Sep 18 2019 10:19 PM

China Open PV Sindhu Reach Pre Quarterfinals Saina Out - Sakshi

చాంగ్‌జౌ(చైనా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచి జోరుమీదున్న తెలుగు తేజాలు పీవీ సింధు, సాయిప్రణీత్‌ చైనా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్‌తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పసిడి పతక విజేత సింధు 21–18, 21–12తో మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌ లీ జురుయ్‌(చైనా)పై గెలిచింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ హోరాహోరీగా సాగినప్పటికీ ఆఖర్లో సింధు ధాటికి జురుయ్‌ తలవంచింది. ఇక రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేయడంతో మ్యాచ్‌ సింధు వశమైంది. 

కాగా, మరో భారత క్రీడాకారిణి, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ 10–21 17–21తో బుసానన్‌ అంగ్‌బమ్రంగ్‌పన్‌(థాయ్‌లాండ్‌) చేతిలో అనూహ్య పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 44 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి సెట్‌ను చేజార్చుకున్నాక రెండో సెట్లో పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్‌ సాధించాక అనంతరం ఏ టోర్నీలోనూ సైనా కనీసం సెమీస్‌కు కూడా చేరలేదు. 

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్‌ 21–19, 21–23, 21–14తో సుపన్యు అవిహింగ్‌సనన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జోడీ సైతం తదుపరి రౌండ్‌కు చేరింది. ఈ ద్వయం 21–13తో తొలి సెట్‌ను దక్కించుకొని రెండో సెట్లో 11–8తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి జంట చిన్‌ చెన్‌ లీ– చి యా చెంగ్‌ తప్పుకొంది. కాగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా–సిక్కిరెడ్డి ద్వయం 12–21, 21–23తో మార్క్‌ లామ్స్‌ఫస్‌–ఇసాబెల్‌ హెర్‌ట్రిచ్‌(జర్మనీ) జోడీ చేతిలో ఓడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement