ప్రపంచ చాంపియన్ షిప్ విజయం తర్వాత పీవీ సింధుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. మొన్న చైనా ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లోనే ఓటమి ఎదురవగా... తాజాగా కొరియా ఓపెన్‌లో మొదటి రౌండ్‌లోనే ఆమె ఇంటిముఖం పట్టింది. సింధుతో పాటు ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సైనా నెహా్వల్ గాయాల కారణంగా తొలిరౌండ్ మ్యాచ్ మధ్యలోనే వైదొలగగా... పారుపల్లి కశ్యప్ ముందంజ వేశాడు.
ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టూర్ వేదికపై ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు చుక్కెదురైంది. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ టైటిలే లక్ష్యంగా బరిలో దిగిన ఈ ప్రపంచ చాంపియన్... తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–7, 22–24, 15–21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది.
అదిరే ఆరంభం లభించినా...
బీవెన్ జాంగ్‌తో పోరులో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుకు అదిరే ఆరంభం లభించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆమె ప్రత్యర్థికి ఏడు పాయింట్లను మాత్రమే కోల్పోయి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఈ గేమ్‌లో సింధు వరుసగా 12 పాయింట్లు సాధించడం విశేషం. రెండో గేమ్‌లో హోరాహోరీగా తలపడ్డారు. కీలక సమయంలో అసాధారణమైన ఆటతీరుతో జాంగ్ 24–22తో గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. విజేతను నిర్ణయించే మూడో గేమ్‌లో సింధు చేతులెత్తేసింది. గేమ్ ఆరంభంలో గట్టి పోటీ ఇచి్చన సింధు... మ్యాచ్ సాగే కొద్ది పాయింట్లు సాధించడంలో వెనుకపడింది. 17–14తో ఉన్న సమయంలో ప్రత్యర్థి వరుసగా నాలుగు పాయింట్లు సాధించడంతో సింధు టైటిల్ ఆశలకు తొలి రౌండ్‌లోనే బ్రేకులు పడ్డాయి.
గాయాలతో వైదొలిగిన సాయి, సైనా
పతకంపై ఆశలు పెట్టుకున్న భారత షట్లర్లు సాయి ప్రణీత్, సైనా నెహా్వల్‌లను గాయాలు దెబ్బతీశాయి. పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో ఐదో సీడ్ ఆండర్స్ ఆంటోన్‌సెన్ (డెన్మార్క్)తో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 9–21, 7–11తో ఉన్న సమయంలో కాలి మడమ గాయం కారణంగా వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో కిమ్ గా ఉన్ (దక్షిణ కొరియా)తో మ్యాచ్‌లో సైనా నెహా్వల్ 21–19, 18–21, 1–8తో ఉండగా గాయంతో తప్పుకుంది.
కశ్యప్ ముందంజ
పారుపల్లి కశ్యప్ మాత్రమే తొలి రౌండ్ అడ్డంకిని దాటి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. అతను 21–16, 21–16తో లు చియా హుంగ్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. నేటి ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో లూయీ డారెన్ (మలేసియా)తో కశ్యప్ తలపడతాడు. పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. తొలి రౌండ్ పోరులో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం 19–21, 21–18, 18–21తో నాలుగో సీడ్ తకేషి కముర– కిగో సొనొడ (జపాన్) జోడీ చేతిలో, మను అత్రి– సుమిత్ రెడ్డి జోడీ 16–21 21–19, 18–21తో క్వాలిఫయర్స్ హ్యూంగ్ కై జియాంగ్– లియు చెంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment