సంచలనం.. ఫైనల్‌లోకి పీవీ సింధు
గ్లాస్గోవ్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తొలిసారి ఫైనల్‌లోకి ప్రవేశించారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోవ్‌లో జరుగుతున్న పోటీల్లో శనివారం రాత్రి జరిగిన రెండో సెమీస్‌లో చైనాకు చెందిన జూనియర్ ఛాంపియన్ చెన్ యుఫీపై 21-13, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించారు.
కేవలం 48 నిమిషాల్లోనే సింధు మ్యాచ్‌ని ముగించటం విశేషం. ఇక ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్లో జపాన్‌కు చెందిన ఒకుహరా తో స్వర్ణం కోసం సింధు ఢీకొట్టబోతుంది. ఒకుహరా మన దేశానికే చెందిన సైనానెహ్వాల్‌ను తొలి సెమీస్‌లోని ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. దీంతో సైనా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పీవీ సింధు ఇప్పటివరకు రెండుసార్లు(2013, 2014) కాంస్య పతకాలు సాధించారు. ఈసారి భారత్‌కు బంగారు పతకం సాధించిపెట్టాలన్న ధీమాతో పోరాడేందుకు సిద్ధమైపోతున్నారు.