
పారిస్: ఈ ఏడాది తొలి వరల్డ్ టూర్ టైటిల్ కోసం వేచి చూస్తున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ మిచెల్లి లీ (కెనడా) పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ యో జియా మిన్ (సింగపూర్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో శుభాంకర్ డే సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్ శుభాంకర్ డే 15–21, 21–14, 21–17తో ప్రపంచ 17వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మరోవైపు మంగళవారం విడుదలైన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.